25-05-2025 11:53:31 AM
న్యూఢిల్లీ: దేశంలో పులుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 122వ 'మన్ కీ బాత్'(Mann Ki Baat)లో ప్రధాని మోదీ ఆదివారం ప్రసంగించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందని ప్రధాని(PM Narendra Modi) పేర్కొన్నారు. నక్సలిజంకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతోందని వెల్లడించారు. నక్సలిజం(Naxalism) నిర్మూలనలో గర్వించే విజయం సాధించామని ప్రధాని సూచించారు. మావోయిస్టుల హింసాత్మక చర్యలు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు. దంతెవాడ ఆపరేషన్ లో జవాన్లు ఎంతో సాహసం చూపారని ప్రధాని కొనియాడారు.
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత దేశమంతా తిరంగా యాత్రలు జరిగాయని పేర్కొన్నారు. పౌర రక్షణ వలంటీర్లుగా మారడానికి యువత ముందుకు వచ్చిందని చెప్పారు. దేశంలో స్వయం సహాయక సంఘాలను మరింత శక్తివంతం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. చేతివృత్తుల కళాకారులను ప్రోత్సహించాలని మోదీ సూచించారు. సంగారెడ్డి మహిళల(Sangareddy womens) గురించి మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రధాని ప్రశంసించారు. సంగారెడ్డి మహిళలు డ్రోన్లను సమర్థంగా వినియోగించారని ప్రధాని తెలిపారు. వచ్చే నెల యోగా దివస్ ను ఘనంగా నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
మన్ కీ బాత్ 122వ ఎపిసోడ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, "నేడు, పొలాల్లో పనిచేస్తూ, ఆకాశం ఎత్తులను తాకే మహిళలు చాలా మంది ఉన్నారు. అవును! మీరు విన్నది నిజమే, ఇప్పుడు గ్రామంలోని మహిళలు డ్రోన్ దీదీగా డ్రోన్‌లను ఎగురవేసి వ్యవసాయంలో కొత్త విప్లవానికి నాంది పలుకుతున్నారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో, కొంతకాలం క్రితం వరకు ఇతరులపై ఆధారపడాల్సిన మహిళలు... నేడు అదే మహిళలు డ్రోన్‌ల సహాయంతో 50 ఎకరాల భూమిలో పురుగుమందులను పిచికారీ చేసే పనిని పూర్తి చేస్తున్నారు. ఉదయం మూడు గంటలు, సాయంత్రం రెండు గంటలు పని పూర్తయింది. మండే ఎండలు, విష రసాయనాల ప్రమాదం కూడా లేదు. గ్రామస్తులు కూడా ఈ మార్పును హృదయపూర్వకంగా అంగీకరించారు. ఇప్పుడు ఈ మహిళలను 'డ్రోన్ ఆపరేటర్లు'గా కాకుండా 'స్కై యోధులు'గా పిలుస్తారు..." అని ప్రధాని పేర్కొన్నారు.