రైతులకు తీపికబురు
- ఈనెల 22న నర్మెట్ట వేదికపై ‘రైతు భరోసా’ ప్రారంభం
మూడు విడతల్లో అన్నదాతలకు నిధులివ్వనున్న సర్కార్
తొలివిడత.. 70 లక్షల మంది ఖాతాల్లోకి రూ.3,590 కోట్లు
హైదరాబాద్, మార్చి15 (విజయక్రాంతి): రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అం దించింది. ఎన్నికల వాగ్దానంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతు భరోసా’ పథకం నిధులను ఈ నెల 22వ తేదీన విడుదల చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించను న్నారు. ఈ పథకం ప్రారంభోత్సవానికి సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదిక కానుంది.
అదేరోజు నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాకర్టీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మొదటి విడత నిధులను సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా విడుదల చేస్తారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో భాగంగా ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్న 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్ల నగదు జమ కానుంది. అలాగే 20 రోజుల అనంతరం రెండో విడతలో రూ.2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరున మూడో విడత నిధులు రూ.9 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
గత ప్రభుత్వం అందించిన రైతుబంధు స్థానంలో, పెంచిన పెట్టుబడి సాయంతో ‘రైతు భరోసా’ను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిధుల విడుదల ద్వారా సాగు పనులకు అవసరమైన ఖర్చుల కోసం రైతులకు ఆర్థిక భరోసా లభించనుంది. కాగా, తొలివిడత నిధుల విడుదల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది. కొంతకాలంగా ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం కానుంది.




