16 March, 2026 | 3:05 AM

లైఫ్‌సన్సైస్‌లో 300 కోట్ల పెట్టుబడి

16-03-2026 01:38 AM

మందుకొచ్చిన కేంబ్రిడ్జ్ ఐసోటోప్ ల్యాబొరేటరీస్, స్థానిక కెమ్ తత్వ చిరల్ సొల్యూషన్స్ 

ఈ ప్రాజెక్టు ద్వారా 250 మందికి ఉద్యోగాలు

ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): అమెరికాకు చెందిన కేంబ్రిడ్జ్ ఐసోటోప్ ల్యాబొరేటరీస్, స్థానిక కెమ్ తత్వ చిరల్ సొల్యూషన్స్ సంయుక్తంగా అధునాతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయని, ఈ కంపెనీలు వచ్చే మూడేళ్లలో రూ.300 కోట్ల పెట్టుబడి పెడతాయని ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ ఫేజ్ ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.

ఆదివారం సచివాలయంలో తనతో సమావేశమైన రెండు కంపెనీల సీఈవోలు పెట్టుబడులకు అంగీకరించారని చెప్పారు. లైఫ్‌సైన్సెస్, స్పెషాలిటీ కెమికల్స్ రంగాల్లో తెలంగాణ ప్రపంచస్థాయి కేంద్రంగా ఎదుగుతున్నదని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ ఐసోటోప్ ల్యాబొరేటరీస్, కెమ్ తత్వల భాగస్వామ్యం అంతర్జాతీయ కంపెనీలకు రాష్ట్రం పై ఉన్న ప్రగాఢ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నదని తెలిపారు.

ఈ పెట్టుబడి ద్వారా అధునాతన కెమిస్ట్రీ, మెటీరియల్స్ రంగాల్లో రాష్ట్ర సామర్థ్యం మరింత పెరుగుతుందని, ఈ అత్యాధునిక తయా రీ కేంద్రంలో ఐసోటోప్ లేబుల్ కాంపౌండ్స్ ఉత్పత్తి అవుతాయని వివరించారు. ప్రాజెక్టు పూర్తయితే దేశం వీటి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోగలుగుతుందన్నారు. ఔషధ పరిశోధనలు, జీవక్రియపై అధ్యయనాలు, రోగనిర్ధారణ పరీక్షలు, ఆధునిక ఎలక్ట్రానిక్స్, ఆర్గానిక్ ఎలక్ట్రో ల్యూమినిసెంట్ మెటీరియల్స్, సెమీకండక్టర్ రంగాల్లో ఇవి విస్తృతంగా ఉపయోగపడతాయని చెప్పారు.

పరిశ్రమకు ఇక్కడి అనుకూల వాతావరణం, నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, అత్యున్నత మౌలిక సదుపాయాలు, మెరుగైన ప్రభుత్వ విధానాల కారణంగా జీనోమ్ వ్యాలీలో పెట్టుబడి పెట్టాలని కంపెనీలు నిర్ణయించుకున్నాయని వెల్లడించారు. కేంబ్రిడ్జ్ ఐసోటోప్ ల్యాబొరేటరీస్‌తో భాగస్వామ్యం ద్వారా తెలంగాణలో ప్రపంచస్థాయి తయారీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయగ లమని కెమ్ తత్వ చిరల్ సొల్యూషన్స్ సీఈవో డాక్టర్ విశాల్ రాజ్‌పుత్ పేర్కొన్నారు. సమావేశంలో కేంబ్రిడ్జ్ ఐసోటోప్ ల్యాబొరేటరీస్ సీఈవో క్లిఫ్ కాల్డ్వెల్, తెలంగాణ లైఫ్‌సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్ప తదితరులు పాల్గొన్నారు.