01-09-2025 12:41:57 PM
న్యూఢిల్లీ: 25వ షాంఘై సహకార సంస్థ (Shanghai Cooperation Organisation) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చైనాలోని టియాంజిన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ద్వైపాక్షిక సమావేశం ప్రారంభమైంది. ఉక్రెయిన్ యుద్ధం గురించి సమావేశంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇరుదేశాల మధ్య బంధాలు మరింత బలోపేతమవుతున్నాయని ప్రధాని మోదీ(Narendra Modi) అన్నారు. ఇరు దేశాల మధ్య అనేక సవాళ్లను మనం అధిగమించామని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి తరుచూ చర్చిస్తూనే ఉన్నామన్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి(Ukraine War) ముగింపు పలకాలని మానవాళి కోరుతోందని మోదీ సూచించారు. యుద్ధం విషయంలో ఇరుదేశాలు నిర్మాణాత్మకంగా వ్యవహారిస్తాయని ఆశిస్తున్నామని నరేంద్ర మోదీ తెలిపారు.
కఠిన పరిస్థితుల్లోనూ భారత్-రష్యా(India-Russia) భుజం భుజం కలిసి నడిచాయని మోదీ వెల్లడించారు. మన సహకారం ఇరుదేశాల ప్రజలకే కాదు.. ప్రపంచశాంతి, స్థిరత్వానికి దోహదమని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అధ్యక్షుడు పుతిన్‌తో తన సమావేశం ఎల్లప్పుడూ చిరస్మరణీయని అభివర్ణిస్తూ ప్రధానమంత్రి మోదీ(Prime Minister Modi) ఈ భావాలను ప్రతిధ్వనించారు. అనేక విషయాలపై సమాచార మార్పిడికి అవకాశం లభిస్తుందని, తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని మోదీ అన్నారు. ఇరువైపులా క్రమం తప్పకుండా ఉన్నతస్థాయి భేటీలు జరిగాయని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో 23వ శిఖరాగ్ర సమావేశం నిర్వహించనున్నట్లు మోదీ తెలిపారు. శిఖరాగ్ర భేటీ కోసం 140 కోట్ల భారతీయులు ఎదురుచూస్తున్నారని వివరించారు. ఇరుదేశాల విశేష భాగస్వామ్య విస్తృతిని ప్రతిబిస్తోందన్నారు.
ప్రియ మిత్రమా అని ప్రధాని మోదీని పుతిన్ సంబోధించారు. ఇరు దేశాల బంధంపై చర్చకు మరో అవకాశం లభించిందని చెప్పారు. తూర్పు, దక్షిణ దేశాలను ఏకం చేయడానికి ఎస్ సీఓ మంచి వేదికని, రష్యా, భారత్ మంచి సంబంధాలను కలిగి ఉన్నాయని అధ్యక్షుడు పుతిన్(Vladimir Vladimirovich Putin) అభివర్ణించారు. ఇరుదేశాల బహుముఖ సంబంధాలను ఆస్వాదిస్తున్నామని తెలిపారు. నేటి సమావేశంలో ఇరుదేశాల సంబంధాలకు గణనీయ ప్రోత్సాహానిస్తోందని చెప్పారు. ఈ భాగస్వామ్యం రక్షణ, ఇంధనం, వాణిజ్యం, సాంకేతికతతో సహా బహుళ రంగాలలో బలమైన సహకారంగా సంవత్సరాలుగా పరిణతి చెందిందని పుతిన్ పేర్కొన్నారు.