25-09-2025 01:40:07 PM
గ్రేటర్ నోయిడా: భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడటంతో ప్రజలపై పన్ను భారం మరింత తగ్గుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం అన్నారు. జీఎస్టీలో సంస్కరణలు నిరంతర ప్రక్రియని చెప్పారు. యుపి అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (Uttar Pradesh International Trade Show)ను ప్రారంభించిన తర్వాత సభికులను ఉద్దేశించి మోడీ(PM Modi Speech) మాట్లాడుతూ... జీఎస్‌టీలో ఇటీవలి నిర్మాణాత్మక సంస్కరణలు భారతదేశ వృద్ధికి కొత్త రెక్కలు ఇస్తాయని, ప్రజలకు ఎక్కువ పొదుపుకు దారితీస్తాయని పేర్కొన్నారు. 2017లో జీఎస్టీని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం పరోక్ష పన్ను విధానంలో సంస్కరణలను ప్రవేశపెట్టిందని, ఇది ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని, ఆ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరిన్ని సంస్కరణలు చేపట్టిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
2014 కంటే ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను దాచడానికి హస్తం పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నాయని ఆరోపించారు. నిజం ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్యాక్సుల ద్వారా లూటీ జరిగిందన్నారు. లూటీ చేసిన ధనంలో నుంచి కూడా దోపిడీ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మాత్రం దేశ ప్రజల ఆదాయం, పొదుపులను పెంచామన్నారు. 2014 కంటే ముందు కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు కేవలం 2 లక్షల వరకు మాత్రమే ఆదాయ పన్ను మాఫీ ఉండేదన్నారు. కేవలం 2 లక్షల వరకు మాత్రమే, కానీ ఇప్పుడు 12 లక్షల వరకు ఆదాయం ఉంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని వివరించారు. నేను మీకు ఒకటి చెప్పదలచుకున్నాను. సంస్కరణల విషయంలో మేం ఇక్కడే ఆగిపోమని ప్రధాని పేర్కొన్నారు.