25-09-2025 01:29:39 AM
బీజేపీ రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకుంటోంది
పాట్నా, సెప్టెంబర్ 24: కులగణనతో దేశంలో ఉన్న పేదల జనాభా తేలిపోతుందని లోక్‌సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. పాట్నాలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో బుధవారం రాహు ల్ గాంధీ మాట్లాడారు. సమావేశానికి పార్టీ చీఫ్ ఖర్గేతో పాటు మొత్తం ౧౭౦ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ముందు గా పార్టీ నేతలు రెండు తీర్మానాలను ఆమోదించారు. ఒకటి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం.
రెండోది ‘ఓట్‌చోరీ’ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చేయడం. అనంతరం రాహుల్ మాట్లా డు తూ.. ‘బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె స్ కూటమి గెలిస్తే రూ. 25 కోట్లకు పైగా విలువైన ప్రైవేట్, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అత్యంత వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పిస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం. కాంగ్రెస్ కులగణన నిర్వహించి ఈ దేశంలో దళితులు, అత్యంత వెనుకబడిన తరగతుల నిజమైన జనాభాను చూపించాలనుకుంటున్నాం. అదే మా భావజాలం.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏం జరిగిందో మీరు చూశారు కదా? ఉత్తర్‌ప్రదేశ్‌లో కుల ఆధారిత నిరసనలు నిషేధానికి గురయ్యాయి. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశం మొత్తం ఇదే జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా బీహార్‌లో నితీశ్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభు త్వం అధికారంలో ఉంది. వారు వెనుకబడిన తరగతుల కోసం ఇవ న్నీ ఎందుకు చేయలేదు? ప్రభుత్వ కాంట్రాక్టులలో రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు.
ఎన్డీయే ప్రభు త్వం మిమ్మల్ని ఉపయోగించుకుంటూ తప్పుదారి పట్టిస్తోంది. నేను చెప్పిన హైడ్రోజన్ బాంబు త్వరలో పేలుతుంది. అది పేలిన రోజు అందరికీ నిజం తెలుస్తుంది’ అని రాహుల్ తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కుట్ర రాజ్యాంగానికి అతి పెద్ద ముప్పు అని, ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ అమలు చేస్తున్న నీచమైన చర్యగా కాంగ్రెస్ ఆరోపించింది. రెండు తీర్మానాల్లో ఒకటి రాజకీయ తీర్మానం కాగా.. మరొకటి బీహార్ ఓటర్లకు అభ్యర్థన.
రిజర్వేషన్స్ పెంచుతాం: ఖర్గే
మేము బీహార్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ పరిమితిని 20 శాతం నుంచి 30 శాతం వరకు పెంచుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ‘బీహార్ ప్రజలు ఎన్డీయే సర్కార్‌తో విసుగు చెందారు. ఇక్కడ నిరుద్యోగం, వలసలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరదలు విధ్వంసం సృష్టించాయి.
కానీ ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు. బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే కుట్ర జరుగుతోంది. దళితులు, గిరిజనులు వెనుకబడిన వర్గాల వారి ఓట్లను లక్ష్యంగా చేసుకున్నారు’ అని ఖర్గే విమర్శించారు. బీహార్‌లో సీడబ్ల్యూసీ సమావేశం జరగడం 80 సంవత్సరాల్లో ఇదే తొలిసారి. రాజకీయ తీర్మానంతో పాటు అనేక జాతీయ అంతర్జాతీయ అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు.
మరోపక్క సీడబ్ల్యూసీ సమావేశాన్ని బీజేపీ ‘మెరె షో’గా అభివర్ణించింది. బీజేపీ ప్రజాధరణను చూసి కాంగ్రెస్, ఆర్జేడీ భయపడుతున్నాయని ఆరోపించింది. గాజా నరమేధంపై వైఖరి తెలపాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సమావేశ తీర్మానాలను వివరించారు.