25-09-2025 02:49:42 PM
హైదరాబాద్: తమ డిమాండ్లు పరిష్కరించాలని సచివాలయం(Secretariat) ముట్టడికి వచ్చిన అంగన్వాడీలను(Anganwadi workers ) పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అంగన్వాడీల అరెస్టుపై స్పందించిన హరీశ్ రావు(Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఛలో సెక్రెటేరియట్ పిలుపునిచ్చిన అంగన్ వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, కర్కషంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటూ బీరాలు పలికిన రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడ అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లకు తరలించడం సిగ్గుచేటు అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా? గుర్తింపు లేదా? ప్రజా పాలన అని రాక్షస పాలన కొనసాగిస్తారా? అంటూ ప్రశ్నలు సంధించారు. ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ(Bathukamma Festival) సంబురం లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగన్ వాడీల ఉసురు తగులుతుందన్నారు. అంగన్ వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ వారు వర్కర్లు కాదని, అంగన్ వాడీ టీచర్లు అని పోస్టును ఉన్నతీకరించారు.. వారి గౌరవాన్ని పెంచారని గుర్తుచేశారు.
2014 నాటికి అంగన్ వాడీ టీచర్లకు కేవలం రూ.4,200, వారి సహాయకులకు రూ.2,200 వేతనం లభించేదన్న హరీశ్ రావు, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.13,650లకు, మినీ అంగన్ వాడీ టీచర్ల వేతనాన్నిరూ.7,800లకు, అంగన్ వాడీ హెల్పర్ల వేతనాన్ని రూ.7,800 లకు పెంచి దేశంలోనే అత్యధికంగా చెల్లించామని పేర్కొన్నారు. అభయహస్తం పేరిట(Abhaya Hastham) ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని 18,000లకు పెంచుతామని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారు. మాయ మాటలు చెప్పి, 22 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీకి అతీ లేదు, గతీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పేరిట మీరు అమలు చేస్తున్న ఉచిత బస్సుల్లోనే జిల్లాల నుంచి సచివాలయం వద్దకు వచ్చి మిమ్మల్ని నిలదీస్తున్నారు. మీ మోసపూరిత వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అరెస్టులు చేసిన అంగన్ వాడీలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల మేనిఫెస్టోలో వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.