12-11-2025 10:50:11 AM
హైదరాబాద్: నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA Padi Kaushik Reddy) హల్ చల్ చేశారు. యూసుఫ్ గూడ వద్ద ఫంక్షన్ హాల్ లోకి కౌశిక్ రెడ్డి దూసుకెళ్లారు. పోలీసులు చెప్పినా వినకుండా అనుచరులతో కలిసి వెళ్లారు. దీంతో యూసుఫ్ గూడ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దొంగఓట్లు వేస్తున్నారని ఇరు పార్టీలు పరస్పర ఆరోపణలు చేశాయి. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉద్రిక్తలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారంటూ కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తించిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ మంగళవారం సాయంత్రం ప్రశాంతంగా ముగిసింది. భారత ఎన్నికల కమిషన్ (ECI) ప్రకారం, పోలింగ్ ప్రక్రియ చాలావరకు సంఘటనలు లేకుండా జరిగింది. సాపేక్షంగా తక్కువ ఓటింగ్ ఉన్నప్పటికీ, నియోజకవర్గంలో 48.47శాతం పోలింగ్ నమోదైంది. ఇది మునుపటి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్వల్ప మెరుగుదల. 2018లో 45.59శాతం, 2023లో 47.58శాతం నమోదైంది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగింది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో 42 కౌంటింగ్ టేబుళ్లలో 10 రౌండ్లలో జరుగుతుంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.