16 May, 2026 | 7:01 PM

Breaking News

పేదలు ఉచిత న్యాయ సేవలు పొందాలి   •   పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ   •   అనురాగ్ లో “హెటెరో ల్యాబ్స్ ఎస్ఎంటీ బ్రిడ్జ్ కోర్స్ 2026–27” ప్రోగ్రాం   •   గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలి   •   అమరవీరులకు నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి   •   తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి   •   కొనుగోలు చేసిన మక్కలని వెంటనే తరలించాలి   •   జాబ్ మేళాలో ఉద్యోగాల ఎంపిక   •   గ్రామంలో బెల్ట్ షాప్ లను ముసివేయాలి   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •  

బెండరలో పోలీసుల మెగా కాంటాక్ట్ డ్రైవ్

16-05-2026 05:49 PM

ఇంటింటికీ తనిఖీలు.. అనుమానితులపై నిఘా.. ప్రజల్లో భద్రతా అవగాహన

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలం బెండర గ్రామంలో శనివారం డీఎస్పీ బి. అశోక్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 30 మంది పోలీసు సిబ్బంది గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ భద్రతా పరిస్థితులపై ఆరా తీశారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ విస్తృత తనిఖీలు చేపట్టారు. 

కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సంచరిస్తున్న వాహనాలను తనిఖీ చేసి సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ వంటి పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని వాహనదారులకు పోలీసులు సూచించారు. రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించారు. అనంతరం గ్రామ ప్రజలతో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ అశోక్ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో ప్రజల సహకారం కీలకమన్నారు.

గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, గంజాయి విక్రయాలు లేదా ఇతర అక్రమ కార్యకలాపాల సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు నమ్మి పంచుకోవద్దని సూచించారు. సీఐ వేణుగోపాల్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువత చదువు, ఉపాధి, క్రీడల వైపు దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.