21-11-2025 11:23:55 PM
శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దు
నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి
నకిరేకల్(విజయక్రాంతి): ప్రజలతో పోలీసులు సత్సంబంధాలు కలిగి ఉండాలని, అదే క్రమంలో శాంతి భద్రతల విషయంలో రాజీపడొద్దని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. శుక్రవారం శాలిగౌరారం పోలీస్ స్టేషన్లో జరిగిన వార్షిక కేసుల తనిఖీ కార్యక్రమంలో భాగంగా ఆయన స్టేషన్ ను సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్టేషన్లో ప్రజలకు అందే సేవల గురించి ఆరా తీశారు. స్టేషన్లో గత కొన్నాళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే స్టేషన్లో నిర్వహిస్తున్న రిజిస్టర్ల వివరాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.
సంవత్సర కాలంలో పలు కీలకమైన కేసులను చేదించినందుకు ఎస్ఐ సైదులు, సిబ్బందిని అభినందించారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం పోలీసులు ప్రతి గ్రామాన్ని సందర్శించి శాంతి భద్రతలపై అవగాహన కల్పించాలన్నారు. తరచుగా జరిగే చోరీలు,రోడ్డు ప్రమాదాలు, అత్యాచారాలు, మాదకద్రవ్యాల విక్రయాలు వంటి చర్యలపై పోలీసుల నిఘా పెంచాలన్నారు. గ్రామాలలోని ప్రజలకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడమే కాకుండా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.