21-11-2025 11:06:17 PM
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్
సంగారెడ్డి,(విజయక్రాంతి): అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించడం, కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ, ఉద్యోగుల తరహాలో హెల్త్ కార్డుల అమలు వంటి సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలను వివరించే వినతిపత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ... జర్నలిస్టుల సంక్షేమం కోసం ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తోంది. ముఖ్యంగా ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛన్లు, మహిళా జర్నలిస్టులకు రాత్రి రవాణా సదుపాయం వంటి కీలక అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లో వేలాది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జర్నలిస్టుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ,
అయితే సుప్రీంకోర్టు తీర్పుతో సమస్య మళ్లీ అడ్డంకులు ఎదుర్కొంటోందని, దీనికి పరిష్కారంగా కొత్త విధానాన్ని ప్రభుత్వం వెంటనే తీసుకురావాలని కోరారు. మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో నివాస సౌకర్యం లేక జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందరికీ ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు ఇచ్చి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అక్రిడిటేషన్ కార్డుల సమస్య తీవ్రమైంది
గత 18 నెలలుగా అక్రిడిటేషన్లు స్టిక్కర్ల ఆధారంగా కొనసాగుతున్నాయని, శాశ్వత కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సురేందర్ తెలిపారు. రాష్ట్ర, జిల్లా అక్రిడిటేషన్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేసి కొత్త కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల హెల్త్ కార్డులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 వేల జర్నలిస్టు హెల్త్ కార్డులు పనికిరాకుండా ఉన్నాయని, కార్పొరేట్, ప్రయివేటు ఆసుపత్రులు వాటిని స్వీకరించడం లేదని, హైదరాబాద్‌లోని నీమ్స్ మాత్రమే కొంతవరకు సేవలు అందిస్తున్నదని తెలిపారు. ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులకు కొత్త వైద్యసేవా విధానం తీసుకురావాలని ప్రభుత్వం కోరారు.
దాడులు పెరుగుతున్న నేపథ్యంలో హైపవర్ కమిటీ అవసరం
ఇటీవల జర్నలిస్టులపై దాడులు పెరిగిన నేపథ్యంలో, పోలీస్, న్యాయ, రెవెన్యూ, సమాచారం, జీఏడీ శాఖలతో కలిసి రాష్ట్ర, జిల్లా స్థాయిలో హైపవర్ కమిటీలను ఏర్పాటు చేయాలని సురేందర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సుదర్శన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి దండు ప్రభు, జిల్లా ఉపాధ్యక్షుడు డేవిడ్, శరత్ బాబు, బాల్‌రాజ్, పటాన్ చెరు డివిజన్ అధ్యక్షుడు సత్యం, కార్యదర్శి శ్రీనివాస్, సంగారెడ్డి డివిజన్ జనరల్ సెక్రటరీ సీహెచ్.రాజు, దస్తగిరి, ప్రవీణ్ కుమార్, వీరేశం, దయానందం, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.