15-11-2025 01:52:52 AM
పాట్నా, నవంబర్ 14 : నితీశ్.. ఓ గొప్ప రాజకీయ వేత్త. పరిణామాలు ఎలా మారుతున్నాయో ఆయన పసిగట్టినంతగా మరెవరికి సాధ్యం కాదంటారు.. రాజకీయ విశ్లేషకులు. ఆయన గౌరవం ముందు ప్రభుత్వ వ్యతిరేకత కొట్టుకుపోయిందనడానికి ప్రస్తుత బీహార్ అసెంబ్లీ ఫలితాలే నిదర్శనమని పేర్కొంటున్నారు. అందుకే ఆయన 20ఏళ్లుగా బీహార్ సీఎంగా కొనసాగుతూ రాజకీ య చాణుక్యుడని తనను ఎందుకు అంటారో నితీశ్‌కుమార్ మరోమారు నిరూపించారు.
ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని..
పాట్నా సమీపంలోని భక్తియార్‌పూర్‌లో నితీశ్‌కుమార్ 1951లో జన్మించారు. తండ్రి కవిరాజ్ రామ్‌లఖన్ సింగ్ స్వాతంత్ర సమరయోధుడు. ఆయుర్వే వైద్యుడు. తల్లి పరమేశ్వరి గృహిణి. నితీశ్ బీహార్ ఇంజినీరింగ్ కాలేజ్ ( ప్రస్తుతం పాట్నా ఎస్‌ఐటీ)లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత రాష్ట్ర విద్యుత్ బోర్డులో కాంత కాలం ఉద్యోగం చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు.
జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమ యంలోనే ప్రస్తుత ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, దివంగత బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ వంటి నేతలతో పరిచయం ఏర్పడింది.
1977నుంచి ఎన్నికల బరిలో..
నితీశ్‌కుమార్ 1977, 80, 85 ఎన్నికల్లో బరిలోకి దిగారు. కానీ,1985లో మాత్రమే ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టారు. 1989,1991,1998, 1999, 2004 లో ఎంపీగా గెలుపొందారు. అస్థిర సంకీర్ణ ప్రభుత్వాలు ఉండడంతో 15ఏళ్లలోనే ఆరు ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఎన్డీఏ సర్కారులో రైల్వే, వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
ఆయన హయాంలోనే ఇంటర్నెట్‌లో టికెట్ బుకింగ్, తత్కాల్, రైల్వే బుకింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. 1999లో బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. 2000 సంవత్సరంలో ఒకసారి వారం రోజుల సీఎంగా పనిచేశారు. తిరిగి జాతీయ రాజకీయాల్లో కొనసాగారు. 2004లో కేంద్రంలోఎన్డీఏ కూటమి ఓటమి పాలవడంతో రాష్ట్ర రాజకీయాల్లోకి పునరాగమనం చేశారు.
వినూత్న ఆలోచనలతో..
రాజకీయ నేతగా నితీశ్‌ది వినూత్న శైలి. ప్రతి ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ఆలోచిస్తారనే పేరుంది. ఇప్పటికే రాష్ట్రంలో 125 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తున్న ప్రభుత్వం ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనను ప్రారంభించింది.
రాష్ట్రంలోని మహిళల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేసింది. ఉపాధిపై దృష్టి పెట్టి మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఇవన్నీ ఎన్డీఏకు కలిసిరావడంతో నితీశ్ మరోమారు సీఎం అయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా..
బీహార్‌కు అత్యధిక కాలం సీఎంగా ఉన్న నితీశ్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది మాత్రం 1985లోనే. జాతీయ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి పునరాగమనం చేసిన తర్వాత ఆయన శాసన మండలి మార్గాన్ని ఎంచుకున్నారు.
ఒక స్థానం నుంచి గెలవడం తనకు సులువని.. అన్ని స్థానాలపై దృష్టి పెట్టడానికి వీవుతుందనే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు నితీశ్ పలు సందర్భాల్లో వెల్లడించారు. 2005లో ఆర్జేడీపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లిన నితీశ్ జోడీ ఎన్డీయేను అధికారంలో తెచ్చింది. దీంతో నితీశ్ రెండోసారి సీఎం పదవి చేపట్టారు.