26-07-2025 01:33:29 AM
హైదరాబాద్, జులై 24 (విజయక్రాంతి): తెలంగాణలో నిర్వహించిన కుల గణన భూకంపాన్ని సృష్టించిందని, ఇది దేశ రాజకీయ భూమిని కూడా కుదిపేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ భూ ప్రకంపనల ప్రభావం దేశమంతటా ఉంటుందని ఆయ న అభిప్రాయపడ్డారు. తన రాజకీయ జీవితంలో దళితులు, షెడ్యూల్ తెగల (ఎస్టీ) సమస్యలను అర్థం చేసుకున్నప్పటికీ.. వెనుకబడిన తరగతులు (ఓబీసీ) వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడంలో విఫలమయ్యానన్నారు.
ఇది తన తప్పేనని.. త్వర లో దానిని సరిదిద్దుకుంటానని తెలిపారు. యూపీఏ హయాంలో ఓబీసీల సమస్యలను తాను అర్థం చేసుకుని ఉంటే దేశంలో ఇప్పటికే కులగణన జరిగి ఉండేదన్నారు. ఇప్పటికే తమ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో విజయవంతంగా కులగణన సర్వే నిర్వహించామని.. త్వరలోనే మిగిలిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా కులగణన నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఢిల్లీ లోని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో శుక్రవా రం తల్కటోరా స్టేడియంలో జరిగిన ‘బాగిదారి న్యాయ మహా సమ్మేళనం’ కార్యక్ర మానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీని మీడియానే బాగా హైప్ చేసిందని.. నిజానికి మోదీకి అంత ధైర్యం లేదని, ఆయన చేసేది అంతా షోనేనని చురకలంటించారు. ఈ మధ్య ఆయన్ను 2,3 సార్లు కలిశానని, ఆయనలో విషయం లేదని అప్పుడే అర్థమైందన్నారు.
మోదీ ఎవరికి పెద్ద సమస్య కాదని.. మీడియానే ఆయనకు ఎక్కువగా ప్రచారం ఇచ్చి హైప్ తెచ్చినట్టు తెలిపారు. భారతదేశ ఉత్పాదక శక్తికి ఓబీసీలు ప్రతీకలని పేర్కొన్నారు. దేశంలో ఓబీసీల చరిత్ర ఎక్కడుందని, ఎవరు రాశారని ప్రశ్నించారు. ఓబీసీల చరిత్ర రాయకపోవడం వెనుక ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర ఉందని రాహుల్‌గాంధీ ఆరోపించారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కలిసి ఓబీసీల చరిత్రను ఉద్దేశపూర్వకంగా చెరిపేస్తున్నాయని దుయ్యబట్టారు. ఓబీసీలు అన్ని రంగాల్లో వివక్ష ఎదుర్కొంటు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ సంస్థల్లోనూ రిజర్వేషన్లను తీసుకురావాల్సిన అవసరం ఉందని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు.
కుల గణన ఎప్పుడో చేయాల్సింది
‘నేను 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఈ రెండు దశాబ్దాల కాలం వెనుదిరిగి చూసుకుంటే ఓబీసీల ప్రయోజ నాలను కాపాడటం కోసం నేను చేయగలిగినంత చేయలేకపోయాననిపిస్తోంది. ఆ సమయంలో మీ సమస్యలను లో తుగా అర్థం చేసుకోలేకపోయాను. ఆ పొరపాటును ఇప్పుడు సరిదిద్దుకోవాలని అను కుంటున్నాను. యూపీఏ హయాంలో ఓబీసీల చరిత్ర గురించి నాకు తెలిసి ఉంటే.. ఎ ప్పుడో కుల గణన నిర్వహించి ఉండేవాడిని.
దీనికి నేను విచారిస్తున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు.. ఇది నా తప్పు. నేను ఆ తప్పును సరిదిద్దుకోబోతున్నాను. సమస్యలను సరిగా అర్థం చేసుకుంటేనే పరిష్కారం సాధించగలమని.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కలిసి ఓబీసీల చరిత్రను చెరిపేశాయి’ అని రాహుల్‌గాంధీ మండిపడ్డారు.
కార్పోరేట్ ఇండియాలో ఓబీసీలు ఎక్కడ..?
ఓబీసీలు ఉత్పాదక శక్తికి ప్రతీకలని, కానీ వారి శ్రమకు తగిన ఫలితాలు అందుకోలేకపోతున్నారని, అన్ని రంగాల్లో వివక్షను ఎదుర్కొంటున్నారని రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కార్పోరేట్ ఇండియాలో ఓబీసీలు ఎక్కడున్నారని..? మీడియా రంగం లో వారికి స్థానం ఎక్కడుంది..? అదానీ ఓబీసీనా..? అని నిలదీశారు. దేశంలో ప్రతి ఒక్క రికి కలలు సాకారం చేసుకునే హక్కు ఉంద ని, రైతు కుమారుడు వ్యాపారవేత్త కావొచ్చని ఆయన పేర్కొన్నారు.
అవకాశాలు అందిపుచ్చుకునే సామర్థ్యం అందరికి రావాలన్నారు. తమ శక్తిని తెలుసుకోకపోవడమే కొందరి సమస్య అని అన్నారు. దేశంలో దళితుల చరిత్రను అంబేద్కర్ మాత్రమే అర్థం చేసుకున్నారని రాహుల్‌గాంధీ తెలిపారు. దళిత, గిరిజనులు అభివృద్ది చెందవద్దని కుట్ర జరుగుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధ్ది నిధు లను కేంద్రం దారి మళ్లించి.. వారి సంపదను అదాని, అంబానీలకు దోచి పెడు తోందని ఆరోపించారు.
అభివృద్ధిలో విద్యదే కీలకపాత్ర..
సమస్యలను సరిగా అర్థం చేసుకుంటేనే పరిష్కారం సాధించగలమని రాహుల్‌గాంధీ అన్నారు. తెలంగాణలో కుల గణన పకడ్బందీగా చేపట్టారని కొనియాడారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మేం తప్పకుండా కుల గణన పూర్తి చేస్తామన్నారు. అభివృద్ధిలో విద్యదే కీలక పాత్ర అని, ఇంగ్లీష్ నేర్చుకుంటేనే అన్ని అవకాశాలు రెట్టింపు అవుతా యన్నారు. అయితే బీజేపీ నేతలు ఇంగ్లీష్‌ను వ్యతిరేకిస్తూనే వారి పిల్లలను మాత్రం ఇంగ్లిషు మీడియంలో చదివిస్తున్నారని చురకలంటించారు.
ప్రాంతీయ భాషలు ముఖ్య మేనని, దాంతో పాటు ఇంగ్లీష్ కూడా కీలకమని చెప్పారు. ఇంగ్లీష్ విద్య ఎస్సీ, ఎస్టీలకు దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. మో దీ ప్రభుత్వం పార్లమెంటులో సమర్పించిన డేటాను చూస్తే కేంద్ర విశ్వ విద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల ప్రాతినిధ్యం తక్కువగా ఉందన్నారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు రిజర్వ్ చేయబడిన పోస్టులలో ఎక్కువ శాతం ఖాళీగా ఉన్నాయన్నారు.
కుట్రపూరితంగానే జనగణన ఆపేసింది..
దేశ వ్యాప్తంగా జన గణనతో పాటు కుల గణనను చేపట్టాలని రాహుల్‌గాంధీ డిమాం డ్ చేశారు. జన గణనతోనే దేశం ఎక్స్‌రే, స్కానింగ్ రిపోర్టు తెలుస్తోందని, సరైన డేటా ఉన్నప్పుడే ఎవరి ప్రాతినిధ్యం ఎంతనేది తెలుస్తుందన్నారు. మోదీ ప్రభుత్వం కుట్ర పూరితంగానే జన గణన ఆపేసిందని విమర్శించారు. దేశంలో కుల, మత రాజకీయా లు పెరిగాయని, మోదీ ప్రభుత్వం ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతోందని దుయ్యబట్టారు.
కుల గణన డేటా కేవలం తెలంగాణ సర్కార్ దగ్గర మాత్రమే ఉందన్నారు. తెలంగాణలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల డేటా ఉందని, సరైన డేటా ఉన్నప్పుడే ఏదైనా చేయగలమన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తు న్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, పీసీ సీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహ రి, కొండా సురేఖ, ఎంపీలు మల్లు రవి, సురేష్‌షెట్కార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎ మ్మెల్యే రాజ్‌ఠాకూర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు హాజరయ్యారు.