పోలింగ్, విదేశీయుల యాక్టివిటీ కీలకం
ఈ వారం మార్కెట్ కదలికలపై నిపుణుల అంచనాలు
న్యూఢిల్లీ, మే 19: లోక్‌సభ ఎన్నికల తదుపరి దశ పోలింగ్, విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ యాక్టివిటీ ఈ వారం ఈక్విటీ మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల సీజన్ కారణంగా ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తారని, దీంతో మార్కెట్ ఒడిదుడుకులు కొనసాగుతాయని భావిస్తున్నారు. మే 18న జరిగిన ప్రత్యేక ట్రేడింగ్‌తో సహా గతవారం మొత్తంమీద సెన్సెక్స్ 1,341 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 446 పాయింట్లు ర్యాలీ జరిపింది.
ఐదో దశ లోక్‌సభ ఎన్నికలు సోమవారం జరుగుతాయి. తుదుపరి దశ పోలింగ్ సైతం ఈ వారంలోనే మే 25న జరగనుంది. కీలక కార్పొరేట్లు సానుకూల ఆర్థిక ఫలితాల్ని వెల్లడిస్తే ఈ అనిశ్చిత మార్కెట్‌కు కొంత ఊరట కలుగుతుందని స్వస్తికా ఇన్వెస్ట్‌మెంట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ చెప్పారు. ఓఎన్‌జీసీ, ఐటీసీ, సెయిల్, ఐటీసీ, ఎన్టీపీసీ తదితర కార్పొరేట్లు ఈ వారం క్యూ4 ఆర్థిక ఫలితాల్ని ప్రకటిస్తాయి.
అంతర్జాతీయ సంకేతాలు
యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ వడ్డీ రేట్లపై సోమవారం వెల్లడించే సంకేతాలూ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని గౌర్ వివరించారు. ఈ అంశాలకు తోడు యూఎస్, జపాన్ నుంచి వెలువడే గణాంకాలు, గ్లోబల్ కరెన్సీ మార్కెట్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెడతారన్నారు. ఇండియా పీఎంఐ మాన్యుఫాక్చరింగ్, సర్వీసెస్ డేటా, యూఎస్ జాబ్‌లెస్ క్లయింలు మార్కెట్‌ను హెచ్చుతగ్గులకు లోనుచేస్తాయని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింగ్ నందా చెప్పారు.
ఒడిదుడుకులుంటాయ్
వచ్చే రెండు వారాల్లో మార్కెట్ ఒడిదుడుకులు పెరుగుతాయని, కొన్ని ఎంపికచేసిన షేర్లలో కొనుగోళ్లు జరుగుతాయని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి తెలిపారు. ఎన్నికల ఫలితాల పట్ల నెలకొన్న అనిశ్చితితో సమీప భవిష్యత్తులో ఒడిదుడుకులు కొనసాగుతాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఎన్నికల సంబంధిత హెచ్చుతగ్గులు కొనసాగనున్నందున ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించాలని, ఒడిదుడుకుల దశలో మంచి నాణ్యతగల స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని ఎస్‌బీఐ సెక్యూరిటీస్ సూచించింది.
వారంలో రూ.12,900 కోట్ల అమ్మకాలు
మే నెలలో తొలి రెండు ట్రేడింగ్ రోజుల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఈక్విటీల్లో రూ.1,156 కోట్లు నికర పెట్టుబడి చేసినప్పటికీ, తదుపరి వరుస అమ్మకాలకు పాల్పడుతున్నారు. గతవారంలో ఎఫ్‌పీఐలు రూ.12,903 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించారు. యూఎస్ బాండ్ ఈల్డ్స్‌లో మార్పులకు అనుగుణంగా ఎఫ్‌పీఐలు స్పందిస్తారని, ఈల్డ్స్ తగ్గితే భారత్ మార్కెట్లో వారు తిరిగి భారీ కొనుగోళ్లు జరుపుతారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్ట్రాటజిస్ట్ విజయకుమార్ వివరించారు. ఎఫ్‌పీఐలు ఎంత వేగంగా పెట్టుబడి చేస్తారో, అంతే వేగంతో మార్కెట్లో విక్రయాలు జరుపుతారని, ఇది మార్కెట్‌పై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని వాటర్‌ఫీల్డ్ అడ్వయిజర్స్ డైరెక్టర్ విపుల్ భోవర్ చెప్పారు.
నేడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు
ముంబైలో లోక్‌సభ ఎన్నికల పోలింగ జరగనున్నందున బొంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లకు సోమవారం మే 20న సెలవు. ముంబైలోని మొత్తం ఆరుస్థానాలకూ ఇదే రోజు పోలింగ్ జరుగుతుంది.






