పనిచేసే వారికే పదవులివ్వాలి
- మండల, జిల్లా కమిటీలను పూర్తి చేయాలి
- పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 10(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికే పదవులు ఇవ్వాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో భువనగిరి పార్లమెంట్ పరిధిలోని తుంగతూర్తి, జనగామ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మండల కమిటీలు, జిల్లా కమిటీలను పూర్తి చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ముందుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఆలేరు ఎమ్మెల్యే, భువనగిరి డీసీసీ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య ధన్వంతి, ఆంక్షారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రేయాన్ష్‌కు అభినందనలు..
రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చెస్ పోటీల్లో ప్రపంచ రికార్డు సాధించిన మంత్రి కొండా సురేఖ మనవడు శ్రేయాన్ష్ మురళీ కృష్ణను పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అభినందించారు. పిన్న వయసులోనే విశిష్ట ప్రతిభ కనబరుస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శ్రేయాన్ష్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.




