03-12-2025 12:00:00 AM
మహబూబాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): కవులకు, కళాకారులకు నిలయం ఓరుగల్లు అని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవని మహబూబాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి పసునూరి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రచయితల వేదిక ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా పౌరసంబంధాల కార్యాలయంలో ప్రపంచ మూడవ తెలుగు మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు.
జనవరి 2026, మూడో తేదీ నుండి 5వ తేదీ వరకు గుంటూరు జిల్లా అమరావతి కేంద్రంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నట్లు, ఈ సభలకు మహబూబాబాద్ జిల్లా నుండి సుమారు 150 మంది కవులు కళాకారులు వెళ్లడం గొప్ప విషయం అని తెలిపారు. క్షేత్రస్థాయిలో అంతరించిపోతున్న కలలకు జీవం పోయడం కళాకారులను కవులను ఆదరించడం చాలా గొప్ప విషయమని, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ నలుమూలల చాటి చెప్పే ప్రతి ఒక్క కళాకారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రచయితల సంఘం అధ్యక్షుడు గుర్రపు సత్యనారాయణ మాట్లాడుతూ గుంటూరు జిల్లా అమరావతిలో జరిగే 3,వ ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లాలోని ఆహ్వానం అందిన రచయితలు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో రచయితలు, కళాకారులు బాణాల వీరయ్య, నాల్లం శ్రీనివాస్, దైద ఉషారాణి, ఆరింపుల అనురాధ, మిట్టగడుపుల భరత్ తదితరులు పాల్గొన్నారు.