31 August, 2026 | 12:03 AM

చిన్నకాపర్తిలో కుమ్మరుల తొలి బోనాల వేడుకలు

31-08-2026 12:00 AM

చిట్యాల, ఆగస్టు 30: చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో కుమ్మర సంఘం ఆధ్వర్యంలో శ్రావణ మాస తొలి బోనాల కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆదివారం బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి కుమ్మర సంఘం జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు తాడూరి చంద్రం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కుమ్మరులు ఐక్యంగా ఉండి తమ సమస్యలను సమిష్టిగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

వృత్తిపరంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. బోనాల సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముత్యాలమ్మ తల్లిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ ఆవుల సుందర్ హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ గంగాపురం భాస్కర్, వార్డు సభ్యులు, కుమ్మర సంఘం మండల అధ్యక్షుడు పాకాల దినేష్, ఉపాధ్యక్షులు ఆరూరి శ్రీను, ఆరూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు.