షూటింగ్‌లో గాయపడిన ప్రభాస్
హీరో ప్రభాస్ కాలికి గాయమైంది. ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా ఆయన గాయపడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ప్రస్తుతం ఈ సినిమా జపాన్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ జపాన్‌లో నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ గాయం కారణంగా ఆయన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రభాస్ సోషల్ మీడియాలో జపాన్ అభిమానులను ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టారు.
‘నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. జపాన్‌లోని అభిమానులను కలవాలని ఎప్పటి నుంచో ఉన్నా కానీ కలవలేకపోతున్నందుకు నన్ను క్షమించాలి. మూవీ షూటింగ్‌లో స్వల్ప గాయం కావడంతో రాలేకపో తున్నా’ అని ఆ పోస్ట్‌లో ప్రభాస్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభాస్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ప్రభాస్ ఏ మూవీ షూటింగ్‌లో గాయపడ్డారనేది తెలియడం లేదు. ‘కల్కి 2898 ఏడీ’ జనవరి 3న జపాన్‌లో విడుదల కానుంది.






