ప్రజ్ఞానందదే సెయింట్ లూయిస్ టైటిల్
యుఎస్‌ఏ, ఆగస్టు 7: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద అంతర్జాతీ య వేదికపై మరోసారి సత్తా చాటాడు. అమెరికాలో జరిగిన సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఒక రౌండ్ మిగిలి ఉండగానే విజేతగా నిలిచాడు. చివరి గేమ్‌ను జవోఖిర్ సిందరోవ్‌తో ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు. ఈ ఫలితం తో టైటిల్ అతని సొంతమైంది. మొత్తం 35 పాయింట్లకు గాను 23 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. సిందరోవ్ 22 పా యింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
వెస్లీ సో 20.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ విజయంతో ప్రజ్ఞానందకు ట్రోఫీతో పాటు 50 వేల అమెరికన్ డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. అలాగే గ్రాండ్ చెస్ టూర్‌లో 13 పాయింట్లు కూడా ఖాతాలో చేరాయి. ప్లేఆఫ్ అవసరం లేకుండానే నేరు గా టైటిల్ గెలవడం విశేషం. ఈ ఫలితంతో గ్రాండ్ చెస్ టూర్ మొత్తం ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ టోర్నీలో ప్రపంచంలోని 10 మంది అగ్రశ్రేణి గ్రాండ్‌మాస్టర్లు పోటీపడ్డారు. ఈ ఏడాది జూన్‌లో నార్వే చెస్ టోర్నమెంట్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు.






