బ్యాటర్లకు వార్మప్ టెస్ట్
* సాధారణంగా శ్రీలంకతో సిరీస్ అంటే టీమిండియానే ఫేవరెట్. కానీ టెస్టుల్లో ఏడాది కాలంగా మన పరిస్థితి దిగజారింది. స్పిన్ ఆడడంలో బలహీనత వెంటాడుతున్న నేపథ్యంలో లంకతో టెస్ట్ సిరీస్‌పైనే అందరి చూపు ఉంది. ఇప్పుడు అసలు సిరీస్ కంటే ముం దు మూడు రోజుల సన్నాహక మ్యాచ్ భారత బ్యాటర్లకు అగ్నిపరీక్షలా మారింది.
- లంక ఎలెవన్‌లో సన్నాహాక మ్యాచ్
- స్పిన్నర్లను ఎదుర్కోవడంపైనే భారత్ ఫోకస్
- టెస్ట్ సిరీస్‌కు ముందు కీలక పరీక్ష
కొలంబో, ఆగస్టు 6 : శ్రీలంక పర్యటనలో టెస్ట్ సిరీస్‌కు ముందు తొలి పరీక్షకు భారత్ సిద్ధమైంది. లంక ఎలెవన్‌తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ శుక్రవారం నుంచే మొదలుకాబోతోంది. రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత బ్యాటర్లకు ఈ మ్యాచ్ ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. లంక స్పిన్ పరీక్షను సమర్థంగా ఎదుర్కొ నేందుకు ఈ మ్యాచ్ కీలకం కాబోతోంది. కొంతకాలంగా స్పిన్‌ను ఆడడంలో భారత కీలక బ్యాటర్లందరూ ఇబ్బంది పడుతున్నారు.
స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల చేతిలో పరాభవాలకు ఇదే కారణం. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీలంకతో సిరీస్ భారత్‌కు అగ్నిపరీక్షగా మారింది. లంక జట్టులో సమర్థవంతమైన స్పిన్నర్లు మన బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం భారత్‌తో వార్మప్ మ్యాచ్ కోసం ప్రకటించిన లంక ఎలెవెన్ లోనూ క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. దీంతో వార్మప్ మ్యాచ్ కూడా భారత్‌కు అంత ఈజీగా ఉండదని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే శ్రీలంకకు బయలుదేరే ముందు వారం రోజులు కెప్టెన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ స్పిన్ బౌలింగ్‌లోనే ఎక్కువగా ప్రాక్టీస్ చేశారు. పైగా భారత జట్టు కోసం బీసీసీఐ కూడా నెట్ బౌలర్లుగా నలుగురు భిన్నమైన స్పిన్న ర్లను ఎంపిక చేసి పంపించింది. ఈ పరిమామాలను చూ స్తే లంక స్పిన్ ఛాలెంజ్‌ను భారత్ ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థమవుతోంది. ప్రస్తుతం లంకపై బరిలోకి దిగ బోతున్న భారత టెస్ట్ జట్టులో రాహుల్, కుల్దీప్, జడేజాలకు మాత్రమే అక్కడ టెస్టులు ఆడిన అనుభవం ఉంది.
మిగిలిన వారిలో ఎక్కువమంది తొలిసారి అక్కడ రెడ్ బాల్ క్రికెట్ ఆడబోతున్నారు. శ్రీలంకలో భారత్ చివరిసారిగా 2017లో పర్యటించిం ది. అప్పుడు మూడు టెస్టుల సిరీస్ ను వైట్ వాష్ చేసింది. అప్పటి జట్టులో రహానే, పుజారా, అభినవ్ ముకుంద్ వంటి టెస్ట్ స్పెషలిస్టులు, కోహ్లీ కెప్టెన్సీ కీల కంగా మారాయి. ప్రస్తుత జట్టులో చాలా మంది బ్యాటర్లకు ఈ సిరీస్ సవాల్ గా మారింది. మరోవైపు బౌలింగ్ లో బుమ్రా లేకపోవడం ఇబ్బందే.
దీంతో వార్మప్ మ్యాచ్ లో ప్రసిద్ధ కృష్ణ, సిరాజ్, గుర్నూర్ బ్రార్, అకీబ్ నబీ ఎలా రాణిస్తారనేది చూడాలి. అలాగే స్పిన్ విభాగంలో కుల్దీప్, జడేజాలతో పాటు మానవ్ సుతార్ , సరాంశ్ జైన్ కీలకం కాబోతున్నారు. ఇదిలా ఉంటే వార్మప్ మ్యాచ్‌లో లంక ఎలెవన్‌కు సోనల్ దినూష సారథిగా వ్యవహరించనున్నాడు. టెస్ట్ సిరీస్‌లో అవకాశం కోసం ఎదురుచూస్తున్న పలువురు యువ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.
పేస ర్లు లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, ఆఫ్ స్పిన్నర్ రమేశ్ మెండిస్ పై అంచనాలున్నాయి. ఇండియా ఎతో మ్యాచ్ లో 10 వికెట్లతో అదరగొట్టిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దిలుమ్ సుదీర కూడా ఎంపికయ్యారు. వీరి స్పిన్ బౌలింగ్ ను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. ఇదిలా ఉంటే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్ పై భారత జట్టు యాజమాన్యం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రాక్టీస్ మ్యాచ్ కోసం పిచ్‌పై కొంత పచ్చికను ఉంచాలని శ్రీలంక క్రికెట్ నిర్ణయించింది.
భారత జట్టు
శుభమన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ (డబ్ల్యుకె), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, దేవ్దుర్ సక్త్రన్, గురునూరు బర్తర్ పాదిబ్, నబీ.
లంక ఎలెవన్ జట్టు
నిషాన్ మదుష్క, రవిందు రశాంత, పసిందు సూరియబండార, పవన్ రత్నాయకే, అహన్ విక్రమసింఘే, సోనాల్ దినుషా (కెప్టెన్), అంజల బండార(వికెట్ కీపర్), నిపున్ దనంజయ, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, అసంక మనోజ్, ఇసిత విజేసుందర, దిలుమ్ రమేష్ మెండిస్






