ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
కలెక్టర్ స్నేహ శబరిష్
మహబూబాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులు, ఫిర్యాదులను వెంటనే పరిశీలించి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను గూగుల్ మీట్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
సోమవారం జిల్లా కలెక్టర్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు రెవెన్యూ కే. అనిల్ కుమార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు, హౌసింగ్ పీడీ పురుషోత్తం, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నితీష్, జిల్లా అధికారులు, అన్ని విభాగాల సిబ్బందితో కలిసి కలెక్టర్ స్నేహ శబరిష్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా వ్యాప్తంగా ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో సంబంధిత విభాగానికి సిఫారసు చేయాలన్నారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పెన్షన్లు, పంచాయతీరాజ్, మున్సిపల్ సంబంధిత విభాగాలపై అధిక శాతం దరఖాస్తులు వస్తున్నాయని, జిల్లా కలెక్టరేట్ తో పాటు, రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయలు తొర్రూరు, మహబూబాబాద్ పరిధిలో కూడా ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని, ప్రజలకు వేగంగా, సత్వర సేవలను అందించాలనే ప్రధాన లక్ష్యంతో పారదర్శకంగా దరఖాస్తులను ఆన్లైన్ చేసి విభాగాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
జిల్లా వ్యాప్తంగా 172 దరఖాస్తులు వచ్చాయని, సంబంధిత విభాగాలకు పంపి చర్యలు తీసుకొనుటకు ఆదేశించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర, పశువైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్, ట్రైబల్, ఎస్సీ, కార్పొరేషన్ అధికారులు దేశీ రామ్ నాయక్, శ్రీనివాసరావు, జిల్లా వైద్య అధికారి డాక్టర్ రవి రాథోడ్, అన్ని విభాగాల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






