28 April, 2026 | 2:54 AM

ప్రజావాణి వినతులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి

28-04-2026 01:11 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి వెంటనే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను ఆదేశించారు. అలాగే ఉద్యోగులందరూ స్వీయ జనగణన కార్యక్రమంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అన్ని విభాగాల అధికారులతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత విభాగానికి సిఫారసు చేయాలని, ప్రతి దరఖాస్తులు పారదర్శకంగా పరిశీలించాలని, సూచించారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు నిర్వహించిన అన్ని కార్యక్రమాలను అందరూ సమిష్టిగా విజయవంతం చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో మరింత పకడ్బందీగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు జరిగే స్వీయ జన గణన కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు తమ పరిధిలో ఉన్న ప్రతి ఉద్యోగులు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజావాణిలో వివిధ శాఖలలో మొత్తం 179 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారినీ కృష్ణవేణి,జిల్లా పరిషత్ సీఈవో పురుషోత్తం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మధుసూదన రాజు, అన్ని విభాగాల జిల్లా అధికారులు, పర్యవేక్షకులు మదన్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు.