calender_icon.png 21 May, 2025 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుపాకీతో బెదిరించి రేప్!

05-05-2024 12:05:00 AM

ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ప్రజ్వల్ దారుణాలు

ప్రజ్వల్ తనను తుపాకీతో బెదిరించి లైంగిక దాడి చేశాడన్న జేడీఎస్ నేత

మరో కేసులో బాధితురాలి కుమారుడి ఫిర్యాదు

ప్రజ్వల్‌కు బ్లూ కార్నర్ నోటీసు పంపే యోచనలో సీబీఐ

బెంగళూరు, మే 4: కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, బహిష్కృత జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఆయన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వందల మంది ప్రజ్వల్ రేవణ్ణ, అతడి తండ్రి హెచ్‌డీ రేవణ్ణ ఆకృత్యాలకు బలైనా ఇంతవరకు వారి ఇంట్లో పనిమనిషిగా చేసిన వ్యక్తి తప్ప మరెవరూ ఫిర్యాదు చేయలేదు. తాజాగా మరో ఇద్దరు ప్రజ్వల్ రేవణ్ణ ఆకృత్యాలపై ఫిర్యాదు చేశారు. 

సొంత పార్టీ నాయకురాలిపై లైంగిక దాడి..

ప్రజ్వల్ రేవణ్ణ సొంత పార్టీ నాయకురాలిని కూడా వదలలేదు. ప్రజ్వల్ తనపై లైంగిక దాడి చేశాడని జేడీఎస్ హసన్ జిల్లా నాయకురాలైన 44 ఏళ్ల బాధితురాలు మే 1న సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై అధికారులు కేసు నమోదు చేశారు. మాజీ పంచాయతీ సభ్యురాలైన ఆమె ప్రజల సమస్యలు వివరించేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసే దానినని, అందులో భాగంగానే 2021లో విద్యార్థులకు హాస్టల్ సీట్ల విషయంలో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను కలిసేందుకు ఆయన అతిథి గృహానికి వెళ్లానని తెలిపారు. అప్పటికే అక్కడ చాలామంది ఉన్నారని, వారంతా వెళ్లాక ప్రజ్వల్ తనను పై అంతస్తులోని గదికి రమ్మని డోర్ లాక్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. తాను అభ్యంతరం తెలపడంతో తుపాకీ తీసి బెదిరించి లైంగిక దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోలు బయట పెట్టడంతో పాటు తన భర్తను చంపేస్తానని బెదిరించాడని వాపోయింది. మూడేళ్లుగా అదే వీడియోతో బెదిరిస్తూ తనపై లైంగిక దాడి చేశాడని ఫిర్యాదులో వెల్లడించింది.

మహిళను కట్టేసి..

మరో కేసులో మైసూర్ జిల్లాలోని కృష్ణరాజ నగర్ పట్టణానికి చెందిన బాధితురాలి 20 ఏళ్ల కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రజ్వల్ రేవణ్ణతో పాటు అతని తండ్రి హెచ్‌డీ రేవణ్ణ, సతీశ్ బాబన్న అనే వ్యక్తిపై గత గురువారం రాత్రి ఫిర్యాదు చేశాడు. తన స్నేహితుడు తన తల్లికి సంబంధించిన వీడియో చూపించాడని, అందులో ఆమెను ప్రజ్వల్ కట్టేసి లైంగిక దాడి చేసినట్లు ఉందని వెల్లడించాడు. ఇదే క్రమంలో ఏప్రిల్ 29న రాత్రి 9 గంటల సమయంలో రేవణ్ణ దగ్గర పనిచేసే సతీశ్ బాబన్న అనే వ్యక్తి వచ్చి తన తల్లిని తీసుకెళ్లాడని, ఆమె ఎక్కడ ఉందో ఇప్పటి వరకు తెలియలేదని వాపోయాడు. హెచ్‌డీ రేవణ్ణ ఇల్లు, తోటల్లో ఆమె ఆరేళ్లు పనిచేసిందని, మూడేళ్ల క్రితం పని మానేసి సొంతూరులో కూలీ పనులకు వెళ్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన తల్లికి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు మైసూర్ సబ్ డివిజన్ పరిధిలోని కేఆర్ నగర్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

బ్లూ కార్నర్ నోటీస్ ఇచ్చే అవకాశం.. 

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు హెచ్‌డీ రేవణ్ణ దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి రేవణ్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 700 మంది పౌరులు జాతీయ మహిళా కమిషన్‌కు బహిరంగ లేఖ రాశారు.

అధికారులతో వాగ్వాదం..

లైంగిక వేధింపుల కేసు విచారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు హోలేనరిసిపురలోని హెచ్‌డీ రేవణ్ణ ఇంట్లో సోదాలు నిర్వహిస్తుండగా జేడీఎస్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

హెచ్‌డీ రేవణ్ణ అరెస్టు 

లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నా రు. తనకు అరెస్టు నుంచి మినహా యింపు ఇవ్వాలంటూ ప్రజాప్రాతినిధ్య కోర్టులో వేసిన పిటిషన్‌ను తిరస్కరించడంతో ఆయనను అధికారులు అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల కేసులో హెచ్‌డీ రేవణ్ణ, ఆయన కుమారుడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై కేఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో కిడ్నాప్, అత్యాచారం తదితర కేసులు నమోదయ్యాయి.