21-05-2025 02:08:12 PM
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao)కు పంపిన నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) స్పందించారు. నోటీసులు ఎన్ని ఇచ్చానా ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు. చట్టాలు, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి నాటకంలో భాగంగానే నోటీసులు పంపినట్లు ఆయన ఆరోపించారు. ప్రజాసమస్యలు గాలికిదిలి నోటీసులిస్తున్నారని మండిపడ్డారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్(KCR)కు నోటీసులు ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. ప్రజా పాలన.. కమీషన్ల పాలనగా మారిందని ధ్వజమెత్తారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా అవన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయని ఆయన జోస్యం చేశారు. న్యాయం, ధర్మం గెలుస్తాయి.. నిజాయతీ ఎప్పటికీ ఓడిపోదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఎస్ ఎల్ బీసీ టెన్నెల్(Srisailam Left Bank Canal) కూలి చనిపోతే ఇంకా మృతదేహాలు బయటకు తీయలేదని ఆయన మండిపడ్డారు. నల్గొండలో సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలింది.. ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం ఇదన్నారు. తులం బంగారం ఏమైంది? రూ. 4 వేల పింఛన్లు మాట ఏమైంది? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో జరిగిన అవకతవకలను దర్యాప్తు చేస్తున్న జ్యుడీషియల్ కమిషన్, కొనసాగుతున్న విచారణలో భాగంగా తన ముందు హాజరు కావాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సమన్లు జారీ చేసింది. నోటీసులు అందాయని బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) వర్గాలు మంగళవారం తెలిపాయి. ప్రాజెక్ట్ బ్యారేజీలకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తున్న కమిషన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు, ప్రస్తుత బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ లకు కూడా నోటీసులు జారీ చేసి, నాయకులను వచ్చే నెలలో హాజరు కావాలని ఆదేశించింది. హరీష్ రావు గత బీఆర్ఎస్ పాలనలో నీటిపారుదల మంత్రిగా, ఈటల రాజేందర్(Eatala Rajendar) ఆర్థిక మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే.