21-05-2025 01:14:06 PM
హైదరాబాద్: ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ(Srisailam Left Bank Canal) సొరంగం కూలిపోయినప్పటి నుండి అందులో చిక్కుకున్న కార్మికుల మృతదేహాలను తిరిగి తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు(BRS Working President KT Rama Rao) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించారు. కాంగ్రెస్ అసమర్థతకు ఇది విషాదకరమైన జ్ఞాపకమని నిందించారు. గత 17 నెలలుగా పాలన చేతకాక, ఇచ్చిన అడ్డగోలు హామీలు నెరవేర్చే దమ్ములేక, తీసుకుంటున్న కమీషన్ల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు.. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలాడినా, పూటకో కమిషన్ వేసి ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా రేవంత్ సర్కార్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ముమ్మాటికీ న్యాయం, ధర్మమే గెలుస్తుందని కేటీఆర్(KTR) తెలిపారు. మాటలు కోటలు దాటుతాయి.. కానీ గుప్పెడు మన్ను కూడా తియ్యలేరు ఈ ప్రగల్భాల పిట్టలదొరలు అని విమర్శించారు.
మూడు నెలల్లో కనీసం ఎస్ఎల్బీసీలో ఇరుకున్న మృతదేహాలను కూడా తియ్యలేదు.. ఎంత సిగ్గు చేటు?! ఇప్పటికయినా ఆ కుటుంబాలను కలిసి, వారికి ప్రభుత్వ సాయాన్ని అందించండని సూచించారు. అక్కడ ప్రమాదం పొంచి ఉందని తెలిసి కూడా మీ కమిషన్ల కోసం కుటుంబాలను చిన్నాభిన్నం చేసినందుకు, వాళ్ల కాళ్ళు పట్టుకొని క్షమాపణలు కోరండని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తీవ్ర నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడిందని కేటీఆర్ విమర్శించారు. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా.. అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లా తేలిపోతాయి ముమ్మాటికి న్యాయం, ధర్మం గెలుస్తుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయత్నంగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి కమీషన్, కమిటీలు పేరిట కాలయాపన చేస్తూ, 6 గ్యారంటీలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే, పెద్ద వాగు కొట్టుకపోతే కమిషన్లకు కకృత్తి పడి ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేటీఆర్ ద్వజమెత్తారు.