ఆసియా అథ్లెటిక్స్‌లో మెరిసిన ప్రవల్లిక
స్వర్ణం గెలిచిన తెలంగాణ అథ్లెట్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): చైనాలోని ఒర్డోస్ వేదికగా తొలి ఆసియా అండర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్- 2026లో మహిళల 4x400 మీటర్ల రిలే విభాగంలో స్వర్ణం సాధించిన తెలంగాణ అ థ్లెట్ ప్రవల్లిక నరిమళ్లను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ కీర్తిని చాటిన ప్రవల్లిక ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
నల్గొండ జిల్లా ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాలలో చదువుతూ, డిండి గురుకుల స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందిన ప్రవల్లిక కష్టపడి ఈ స్థాయికి చేరుకోవడం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని సీఎం అన్నారు. తాపీ మేస్త్రీ కుమార్తెగా సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రపంచ వేదికపై స్వర్ణం సాధించడం పట్టుదల, కృషికి నిదర్శనమని కొనియాడారు.
మహిళల 4x400 మీటర్ల రిలేలో ప్రవల్లికతో పాటు శ్రావణి సచిన్ సాంగ్లే, సాంద్రమోల్ సాబు, నోఫిసా ఖతూన్లతో కూడిన భారత జట్టు 3 నిమిషాల 33.62 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ ప్రదర్శనతో ఆతిథ్య చైనాను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచిం ది. ప్రవల్లిక రాష్ట్రస్థాయి పోటీల్లోనే 23 స్వర్ణాలతో సహా మొత్తం 35 పతకాలు సాధించి తన ప్రతిభను చాటుకుందని సీఎం గుర్తు చేశారు. ఆమెను తీర్చిదిద్దిన కోచ్‌లను కూడా ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం 16 పతకాలు గెలవడంపై ఆనందం వ్యక్తం చేశారు.






