27-10-2025 01:49:29 AM
ప్రత్యేక దృష్టి సారించిన ఎన్నికల అధికారి కర్ణన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఓటింగ్ శాతాన్ని పెంచే లక్ష్యంతో స్వీప్ చైతన్య కార్యక్రమాలను ఉధృతం చేయడంతో పాటు, రికార్డు స్థాయిలో అభ్యర్థులు బరిలో ఉండటంతో అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.
జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వి కర్ణన్ ఈ కార్యక్రమాలను ప్రత్యే కంగా పర్యవేక్షిస్తున్నారు. ఓటర్లలో చైతన్యం నింపి, పోలింగ్ శాతాన్ని పెంచేందుకు స్వీప్ కార్యక్రమాలు నియోజకవర్గ వ్యాప్తంగా ఊపందుకున్నాయి. ఎల్లారెడ్డిగూడలోని శ్రీ శారద మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఓటు హక్కు ప్రాధాన్యతను సృజనాత్మకంగా వివరించారు. విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. యూసుఫ్‌గూడ కృష్ణకాంత్ పార్కులో పోలిం గ్ తేదీ (11 ఐ ఓట్ ఫర్ శుర్ అనే సందేశాలతో కూడిన భారీ బెలూన్‌ను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రదర్శించారు.
అదనపు బ్యాలెట్ యూనిట్లకు ర్యాండమైజేషన్
జూబ్లీహిల్స్ బరిలో నోటాతో కలిపి మొత్తం 59 మంది అభ్యర్థులు ఉండటంతో పోలింగ్ నిర్వహణకు అదనపు బ్యాలెట్ యూనిట్లు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం చాదర్‌ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్‌లో సప్లిమెంటరీ బ్యాలెట్ యూనిట్లకు ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు.
డీఈవో ఆర్‌వి కర్ణన్ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి, ఉప ఎన్నిక కోసం బ్యాలెట్ యూనిట్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో జీహెఎంసీ అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ పాల్గొన్నారు.