27-10-2025 01:43:54 AM
కార్యనిర్వహణ వ్యవస్థపై తీవ్ర ఒత్తిళ్లు
-తెలంగాణ వచ్చిన నాటినుంచి ఇదే తతంగం
-ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అవే ఇబ్బందులు
-పాలనాపరమైన విభేదాలు, కీలక పత్రాల లీక్ ఆరోపణలు
-అప్రాధాన్య పోస్టులకు ఐఏఎస్‌ల బదిలీలు
-కొందరు స్వచ్ఛందంగా పదవీ విరమణ
-తాజాగా ఇదే బాటలో సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీ
హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ప్రజాస్వామిక వ్యవస్థను సజావు గా నడిపించడంలో శాసన, న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థలది కీలక పాత్ర. అందు కే భారత రాజ్యాంగం ఈ మూడు వ్యవస్థలకు సమాన హక్కులు కల్పించింది. కానీ, శాసన వ్యవస్థ ప్రస్తుతం మిగిలిన రెండు వ్యవస్థలను నియంత్రిస్తున్నదనే విమర్శలున్నాయి.
ముఖ్యంగా కార్యనిర్వాహక వ్యవస్థపై శాసన వ్యవస్థ ఆధిపత్యం కలిగి ఉందనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పరిణా మా లు ఇవే తరహాలో ఉన్నాయి. వాస్తవానికి శాసన వ్యవస్థ చట్టాలను చేసి, నిర్ణయాలు తీసుకోవాలి. కార్యనిర్వాహక వ్యవస్థ ఆ నిర్ణయాలను అమలు చేయాలి. వాటి అమలులో తప్పులు దొర్లితే న్యాయవ్యవస్థ సరిదిద్దాలి. అయితే.. ఈ ఇది కేవలం మాటలకు పరిమితమవుతున్నది.
శాసన వ్యవస్థ చేసిన నిర్ణయాలను అమలు చేయడంలో రాజకీయ జోక్యం రోజురోజుకు పెరిగిపోవడంతో కార్యనిర్వాహక వ్యవస్థ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. అది ఇప్పుడు ఏ స్థాయికి చేరిం దంటే కార్యనిర్వాహక వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ చేసే పరిస్థితి వచ్చింది. ఇటీవల ఆబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శి సయ్యద్ అలీ మూర్తజా రిజ్వీ వీఆర్‌ఎస్ తీసుకోవడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల చదరంగంలో ఉన్నతాధికారులు బల అవుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
రాజకీయాలకు బలైన అధికారులు..
తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించి న అధికారులను బదిలీ చేయడం లేదా పక్క న పెట్టడమనేది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న జరిగిదే. ఉదాహరణకు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు, ఆయన అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డితో ఔటర్ రింగ్ రోడ్ టోల్ వేలం అం శంపై విభేదాలు తలెత్తాయి. రేవంత్‌రెడ్డి ఆ సందర్భంలో అర్వింద్‌కుమార్‌ను బీఆర్‌ఎస్ ఏజెంట్ అని ఆరోపించారు. తర్వాత పరిణామాల్లో రేవంత్‌రెడ్డి అరెస్టయ్యారు.
అర్వింద్ కుమార్ లీగల్ నోటీసులు ఇచ్చినప్పటికీ, రేవంత్‌రెడ్డి కౌంటర్ చర్యలకు ఉపక్రమించారు. అంతకుముందు అర్వింద్‌కుమార్ ఇంధన విభాగంలో ఉన్నప్పుడు, ఛత్తీస్‌గఢ్ నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు లేఖ లీకైన ఘటనతో ఆయన్ను ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే, కొత్త సర్కార్ ఆయన్ను ముఖ్య వ్యవహారాల నుంచి పూర్తిగా దూరం చేస్తూ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖకు బదిలీ చేసింది. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని 2019లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఆయన్ను స్టేట్ ఆర్కువ్స్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు అప్పగించింది.
అప్రాధాన్యత పదవి అప్పగించడంతో ఆయన విసిగిపోయి వీఆర్‌ఎస్ తీసుకున్నారు. అప్పుడాయన వివ క్ష, పనికి తగిన అవకాశం లేకపోవడం వంటి అంశాలను ఆయన కారణాలుగా చూపారు. తరువాత ఆయన ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి విద్యాశాఖ సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఈ క్రమంలో ఆకునూరి మురళిని తిరిగి ఆహ్వానించారు. రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు.
ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి బీఆర్ మీనా ఎంతో అనుభవం ఉన్న అధికారి అయినప్పటికీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆయన్ను అనేకసార్లు బదిలీ చేసిం ది. 2021లో మీనా పదవీ విరమణ చేశారు. మరో ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంకు పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కీలక బాధ్యతలు దక్కలేదు. 2024 నవంబర్‌లో ఆయన వీఆర్‌ఎస్ తీసుకున్నారు. తర్వాత ప్రభుత్వం ఆయ న్ను టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది.
కాంగ్రెస్ పాలనలో కొత్త కల్లోలం..
2023 చివర్లో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా అధికార వ్యవస్థలో అస్థిరత ఆగలేదు. ఇప్పటికీ అది కొనసాగుతున్నది. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే అప్పటి పర్యాటకశాఖ సెక్రటరీ స్మితా సబర్వాల్ మరోశాఖకు బదిలీ అయ్యారు. ఈ ఏడాది హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయం లో కంచ గచ్చిబౌలిలోని భూములపై ఒక ఏఐ ఆధారిత వీడియోను రీపోస్ట్ చేయడం సర్కార్‌కు ఆగ్రహం తెప్పించింది.
దీంతో ఆమె ప్రాధాన్యత లేని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్‌కు బదిలీ అయ్యారు. తర్వాత ఆమె అరోగ్య కారణాలు నివేదించి దీర్ఘకాలిక సెలవులకు వెళ్లారు. గత నెలలో మరో పెద్దస్థాయి బదిలీ ల వేవ్ వచ్చింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారు ల మాస్ బదిలీలు జరిగాయి. దీనిలో భాగంగానే సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాను ప్రొటోకాల్ ఉల్లంఘన, హైకోర్టు మందలింపు తదితర కారణాలతో బదిలీ అయ్యారు.
వివాదాలు, ఆరోపణలు..
తాజాగా ఆబ్కారీశాఖలో కీలక పదవి బాధ్యతల్లో ఉన్న సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ చర్చకు మరింత ఊతమిచ్చింది. ఈ నెల 22న ఆయన ఆ నిర్ణ యం తీసుకున్నారు. మద్యం విధాన అమలు పై ఎక్సుజ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, ఆయనకు మధ్య నెలకొన్న సంఘర్షణే కారణమని సమాచారం.
ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనలు రేపింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సర్కార్ ఐఏఎస్ అధికారులను వేధించి అవినీతి లేదా రిటైర్మెంట్ వైపు నెట్టేస్తోందని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ వైఖరి కారణంగా ఐఏ ఎస్‌లు ఒత్తిడికి గురవుతున్నారని ఆరోపించా రు.
1989 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెం దిన సోమేశ్ కుమార్‌కు బీఆర్‌ఎస్ పాలనలో 2019 మధ్య సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.కానీ, ఆయన 2024లో డీవోపీటీ/ క్యాట్ ఆదేశాల మేరకు ఏపీ క్యాడర్‌కు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆయన వెంటనే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. రాజకీయ ఒత్తిడిని కారణంగానే ఆయన ఆ నిర్ణయం తీసుకు న్నట్టు కూడా ప్రకటించారు. బీజేపీ వర్గాలు ఆయన్ను ‘కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల్లో బీఆర్‌ఎస్‌కు అనుకూలమైన పాత్ర పోషించిన వ్యక్తి’ అని ఆరోపించాయి.
ఇలాంటి తరహా తెలంగాణలో పాలనా స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రాజకీయ పరిణామాలు మారుతు న్న కొద్దీ, అధికారులు వాటిని ఎదుర్కొవడం కంటే విధుల నుంచి తప్పుకొనేం దుకే ఆసక్తి చూపడం శోచనీయం. 2024 ఓఆర్‌ఆర్ అంశంపై సిట్ విచారణలు కొనసాగుతున్న నేపథ్యంలో మరికొందరు అధికా రుల భవితవ్యం సందేహంగానే అభిప్రాయం ఆ వర్గాల్లో ఉందని సమాచారం.
తెలంగాణ వచ్చింది మొదలు..
2014లో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర కేడర్ బ్యూరోకాట్లు రాజకీయ ఆటుపోట్ల మధ్య ఊగిసలాడుతున్నారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల కెరీర్ రాజకీయ పరిణామాలకు బలైపోతున్నది. 2014 వరకు బీఆర్‌ఎస్ పాలన, ఆ తర్వాత పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఉన్నతాధికారులు తరచుగా బదిలీలకు గురవుతున్నారు. కొందరు లూప్ లైన్ పోస్టులకే పరిమితమవుతున్నారు. రాజకీయ విభేదాల వల్ల కొందరు ఐఏఎస్‌లు స్వచ్ఛంద విరమణ(వీఆర్‌ఎస్) తీసుకోవాల్సి రావడం సాధారణమైంది.
పాలనాపరమైన విభేదాలు, కీలక పత్రాల లీకు వంటి ఆరోపణల కారణంగా చాలా మంది అధికారుల కెరీర్ దెబ్బతిన్నది. ‘మాది సన్నని తాడుపై నడక లాంటిదే.. కళ్లుమూసి ఆదేశాలు పాటించాలి. లేకుంటే పక్కకు తప్పించేస్తారు’ అని ఇటీవల ఒక అధికారి వ్యాఖ్యానించడం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు తార్కాణం. రాష్ట్రంలో మొత్తం 339 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 153 మంది ఐఏఎస్, 133 మంది ఐపీఎస్, 53 మంది ఐఎఫ్‌ఎస్‌లు.
బదిలీ, వీఆర్‌ఎస్ ఐఏఎస్‌లు వీరే..
-తెలంగాణ వచ్చిన నాటి నుంచే ఐఏఎస్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆ వర్గాలు చెప్తున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తరచుగా తమలో కొందరిని బదిలీ చేయడం, ప్రాధాన్యం లేని పోస్టులకు పంపించడం జరుగుతున్నదని భావిస్తున్నాయి. కొందరు ఐఏఎస్‌లు ఈ పరిణామాలకు తాళలేక స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సందర్భాలూ అనేకం.
-బీఆర్‌ఎస్ పాలనలో కీలకమైన వివరాలు మీడియాకు లీక్ చేసిన ఆరోపణల నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఢిల్లీకి బదిలీ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విపత్తుల నిర్వహణ విభాగం అనే అప్రాధాన్య పోస్టు బాధ్యతలు తీసుకున్నారు.
-Discrimination, workలకు అవకాశం లేకపోవడం వంటి ఆరోపణల నేపథ్యంలో ఆకునూరి మురళీ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. అనేక పరిణామాల తర్వాత ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్‌గా సేవలందిస్తున్నారు.
-ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఆరునెలల క్రితం ఓ విషయంలో రాష్రప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే ఆరోపణల నేపథ్యంలో బదిలీ అయ్యారు.
-మంత్రి జూపల్లి కృష్ణారావుతో వచ్చిన కోల్డ్‌వార్ కారణంగా ఇటీవల సీనియర్ ఐఏఎస్ సయ్యద్ అలీ మూర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఏదేమైనా.. వరుసగా ఐఏఎస్ స్థాయి అధికారుల స్వచ్ఛంద విరమణ, బదిలీ అంశాలు తెలంగాణ పాలన స్థిరత్వంపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.