calender_icon.png 27 October, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రగతి పాలనా.. బుల్డోజర్ రాజ్యమా?

27-10-2025 01:29:51 AM

జూబ్లీహిల్స్ ప్రజలు బేరీజు వేసుకోవాలి

-తెలంగాణలో తొలిసారి మైనార్టీ ప్రాతినిథ్యం లేని ప్రభుత్వం ఏర్పడింది 

-ఆరుగురు ఎమ్మెల్సీలకు అవకాశం ఉన్నా ఎందుకు ఇవ్వలేదు?

-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి) : పదేళ్ల పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సాగిన బీఆర్‌ఎస్ పాలనను.. కాంగ్రెస్ రెండేళ్ల మోసాలు.. బుల్డో జర్ రాజ్యాన్ని బేరీజు వేసుకుని ఉప ఎన్నికలో ఓటు వేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట డివిజన్ రిలయన్స్ జూబ్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పా టుచేసిన సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తీవ్రంగా విమర్శించారు. మైనా ర్టీ ప్రాతినిథ్యం లేని తొలి కాంగ్రెస్ ప్రభు త్వం తెలంగాణలోనే ఏర్పడిందని కేటీఆర్ విమర్శించారు. ఆరుగురు ఎమ్మెల్సీలకు అవకాశం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఒక్క మైనార్టీకి కూడా ఎందుకు ఇవ్వలేదని, ఈ విషయాలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని  డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే..

‘తెలంగాణలో రేవంత్‌రెడ్డి, బీజేపీ కలిసి పనిచేస్తున్నారు. ఇక్కడి కాంగ్రెస్ నేతలు అంతా బీజేపీతో కలిసిపోయారు. బీజేపీ ఎంపీలకు పిలిచి మరీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తోంది. బలమైన ప్రాంతీ య పార్టీలన్నింటినీ కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీ టీం అంటున్నాయి’ అని కేటీఆర్ విమర్శించారు.

ఇతర రాష్ట్రాల్లో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని విమర్శించే రాహుల్ గాంధీకి తెలంగాణలో అదే బుల్డోజర్ పాల న కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది. పేదల ఇళ్లపై బుల్డోజర్ పెడుతున్న రేవంత్ రెడ్డి పరిపాలన రాహుల్ గాంధీకి కనిపించడం లేదు. రాహుల్ గాంధీ సొంత ముఖ్యమంత్రిని పొగుడుకుంటూ, ఆయనను ఆదర్శంగా తీసుకుంటూ మౌనంగా ఉంటున్నాడు’ అని ఆయన మండిపడ్డారు.

వక్ఫ్ చట్టాన్ని అమలు చేసింది.. కాంగ్రెస్సే

కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించిన వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారిన వెంటనే అమలు చేసిన తొలి రాష్ర్టం తెలంగాణ అనే విషయం రాహుల్ గాంధీకి తెలియడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్రాల కన్నా ముందే ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన వక్ఫ్ చట్టాన్ని అమలు చేసిందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌లో ఉన్న అనేక సమస్యల పరిష్కారంపై బీఆర్‌ఎస్ దృష్టి పెట్టిందని కేటీఆర్ గుర్తుచేశారు.

‘ఒక్క సంవత్సరంలోనే అపార్ట్‌మెంట్‌ల నుంచి మొదలుకొని అన్ని ప్రాంతాల్లో జనరేటర్లు, ఇన్వర్టర్ల పరిస్థితి లేకుండా నిరంతర విద్యుత్ అందించగలిగాము. హైదరాబాద్ నగర ప్రగతి, శాంతి భద్రతలపై అనుమానాలు ఉన్నవాటన్నిటిని తొలగించి అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దాము. శాంతియుతంగా, సోద రభావంతో ప్రతి ఒక్కరూ కలిసి ఉండే విశ్వ నగరాన్ని తయారు చేసే దిశగా విజయం సాధించాము. మత రాజకీయాలు లేకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేశాము’ అని తెలిపారు. 

విద్యావంతులు సరైన నిర్ణయం తీసుకోవాలి..

అడ్డగోలు హామీలు, మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విద్యావంతులు పోలింగ్ రోజు బయటకు వచ్చి సరైన నిర్ణయం తీసుకోవాలి. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి. రైతు నుంచి విద్యార్థి వరకు, మహిళ నుంచి ఉద్యోగి వరకు..ఎవ్వరికీ న్యాయం చేయలేదు.సమాజంలోని ప్రతి వర్గం కాంగ్రెస్ పార్టీ  మోసాన్ని గుర్తించింది’ అని ఆయన అన్నారు.