16-07-2025 12:33:24 AM
జిల్లా కలెక్టర్ హైమావతి పర్యవేక్షణ
హుస్నాబాద్, జూలై 15 : తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ హైమావతి మంగళవారం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు పలు దిశానిర్దేశాలు చేశారు. గవర్నర్ పర్యటనను విజయవంతం చేసేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కోహెడ మండల కేంద్రంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సభలో స్టిల్ బ్యాంక్ ప్రారంభోత్సవం, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీతో పాటు మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం స్టేజ్, వీవీఐపీ గ్యాలరీ ఏర్పాటు, వీఐపీ, సాధారణ వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, బారికేడ్ల వంటివి నిబంధనలకు అనుగుణంగా చేయాలని కలెక్టర్ ఏజెన్సీలకు సూచించారు. గవర్నర్ పర్యటన కోసం కోహెడలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల మైదానంలో తాత్కాలిక హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాకుండా, బస్వాపూర్లో 50 ఎకరాల్లో మెగా ఆయిల్ ఫామ్ మొక్కలు నాటే కార్యక్రమ ఏర్పాట్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్, హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి, ఏసీపీ సదానందం, డీఆర్డీవో జయదేవ్ ఆర్య, డీపీవో దేవకీ దేవి తదితరులున్నారు.