16-07-2025 12:34:51 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
చేగుంట, జూలై 15 : గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం ఆయన చేగుంట మండలంలో విస్తృతంగా పర్యటించి పులిమామిడి గ్రామంలో అంగన్వాడి కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, గ్రామ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో పారిశుధ్యం పనులు పనులు విస్తృతంగా చేపట్టాలన్నారు.
ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలన్నారు. దోమ లార్వా పెరగకుండా ఉండేందుకు నీరు నిలవ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం అంగన్వాడి సెంటర్ పాఠశాలను సందర్శించి ప్రశ్నలు సమాధానాలతో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి సంతృప్తివ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇండ్లపై పర్యవేక్షణ..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పులిమామిడి, బోనాల గ్రామాలలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 9,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 5,000 ఇండ్లు గ్రౌండింగ్ అయి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని,
మిగిలిన ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనుల త్వరితగతిన గ్రౌండింగ్ చేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో ప్రోత్సహించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని తెలిపారు.