08-01-2026 01:33:48 AM
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని
మహబూబ్ నగర్ టౌన్, జనవరి 7: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా మున్సిపాలిటీ ఓటర్ జాబితాలపై వచ్చిన అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన కార్యచరణ పూర్తి చేసి సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని అన్నారు. బుధవారం తెలంగాణా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ జిల్లా కలెక్టర్ లు,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పోరేషన్ల కమిషనర్ లతో రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణ సన్నద్ధత పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వి.సి.కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ లు పాల్గొన్నారు. తెలంగాణ మునిపాలిటీ చట్టం, 2019 లోని సవరించిన సెక్షన్ 195-A ప్రకారం వార్డు వారీ ఓటర్ల తుది జాబితాను ఈ నెల 12న ప్రచురించవలెనని,ఈ నెల 13 న పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితాను ప్రచురింఛి, వాటిని టీ-పోల్ నందు అప్-లోడ్ చేయవలెనని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సూచించారు.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటుగా ఫోటోతో కూడిన ఓటర్ల తుది ఓటర్ల జాబితాను వార్డులోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించవలెనని సూచించారు. పోలింగ్ నిర్వహణలో భాగంగా అవసరమగు బ్యాలెట్ బాక్సుల అంచనా, రిటర్నింగ్ అధికారుల సహాయ రిటర్నింగ్ అధికారుల, జోనల్ అధికారుల, ఎఫ్‌ఎస్టి , ఎస్‌ఎస్టీ నియామకం చేయవలసినదిగా ఆమె ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది నియామకం కొరకు ఉద్యోగుల వివరములు టీ-పోల్ నందు అప్ డేట్ చేయాలని ఆమె సూచించారు. ఈ వి.సి.లో మహబూబ్ నగర్,భూత్పూర్,దేవరకద్ర కమిషనర్ లు పాల్గొన్నారు