12-12-2025 12:00:00 AM
మేడ్చల్, డిసెంబర్ 11 (విజయ క్రాంతి): భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికై ఈనెల 17న హైదరాబాద్(బొల్లారం) వస్తున్న సందర్భంగా కలెక్టర్ మను చౌదరి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17న రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో జిల్లాలోని హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకొంటారని అక్కడ నుంచి బొల్లారంకు రోడ్డు మార్గం ద్వారా వెళ్తారని అన్నారు.
ఈ నేపథ్యంలో హకీంపేట ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి రాక సందర్భంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి శీతాకాల విడిదికి వస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని అలాగే తిరిగి వెళ్ళే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో జిల్లా అటవీ శాఖ అధికారి ఆధ్వర్యంలో మంచి మొక్కలు, ప్లాంటేషన్ చేయడంతో పాటు రాష్ట్రపతి వెళ్ళే సమయంలో రోడ్లకు ఇరువైపులా అందమైన మొక్కలను ఉంచాలని ఈ విషయంలో అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఎయిర్పోర్టుతో పాటు ఆయా ప్రాంతాల్లో అవసర మైన చోట మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని తూంకుంట మున్సిపల్ కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందితో పాటు అవసరమైన మందులు, మెడికల్ కిట్స్ అందు బాటులో ఉంచాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఉమా గౌరికి తెలిపారు. రాష్ట్రపతి హకీంపేట ఎయిర్ పోర్టు నుంచి బొల్లారం వెళ్ళే రహదారిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గుంతలను పూడ్చివేయడం, కొత్తగా రోడ్డు వేయడం చేయాలని ప్రయాణం ఇబ్బందులు లేకుం డా జరిగేలా చర్యలు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ మూర్తి కు కలెక్టర్ సూచించారు.
హకీంపేట ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గాన రాష్ట్రపతి బయలుదేరి వెళ్ళే సమయంలో అవసరమైన బందోబస్తు కల్పించడంతో పాటు ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించరాదని పోలీసు అధికారులకు వివరించారు. అలాగే ఎయిర్ పోర్టులో అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచాలని ఫైర్ ఆఫీసర్ ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
ఎయిర్పో ర్టుతో పాటు రాష్ట్రపతి వెళ్ళే మార్గంలో అవసరమైన శానిటేషన్ను సంబంధిత మున్సిపల్ కమిషనర్లు చూసుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని కలెక్టర్ ఆదేశించారు. ఆర్ అండ్ బి ఈఈ శ్రీనివాసమూర్తి, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీధర్, ట్రాఫిక్ ఎసిపి వెంకట్ రెడ్డి, అటవీ శాఖ అధికారి వేణు మాధవ్, ఫైర్ అధికారి జయకృష్ణ, అల్వాల్ ఎస్ హెచ్ ఓ ప్రశాంత్, ఫుడ్ సేప్టీ అధికారి నిలీష, తూంకుంట మున్సిపల్ కమీషనర్ జ్యోతి, శామీర్ పేట్ తహాసీల్దార్ సంయుక్త తదితరులు పాల్గొన్నారు.