calender_icon.png 21 September, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీతో 'వన్ నేషన్.. వన్ టాక్స్'

21-09-2025 05:20:10 PM

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) ఢిల్లీ నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభమవుతుందని, జీఎస్టీ మార్పులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. దేశమంతా సంతోషపడే జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వస్తున్నాయని, జీఎస్టీ 2.0 సంస్కరణలు భారత వృద్ధిరేటుకు మరింత ఊతమిస్తాయని పేర్కొన్నారు. రేపటి నుంచి కొత్త చరిత్ర మొదలవుతుందని.. కొత్త జీఎస్టీ వల్ల ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ఇద్దరికీ ప్రయోజనం ఉంటుందని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్బార్ భారత్ కు మరింత ఊతమిస్తాయని.. జీఎస్టీ సంస్కరణలతో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని అన్నారు. గతంలో దేశంలో రకరకాల పేర్లతో ఎన్నో పన్నులు ఉండేవని, అన్ని రకాల పన్నులను రద్దు చేసి 2017 లో జీఎస్టీని తీసుకువచ్చామని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజల పొదుపు పెరుగుతుందని, ప్రజలను గందరగోళం నుంచి జీఎస్టీ బయటపడేసిందని అన్నారు.

జీఎస్టీతో వన్ నేషన్.. వన్ టాక్స్.. స్వప్నం సాకారం అయిందని, పన్నుల సంస్కరణలతో వృద్ధిరేటు స్థిరంగా కొనసాగుతుందని అన్నారు. ఒక నగరం నుంచి మరో నగరానికి వస్తు రవాణా సులభమవుతుందని.. రాష్ట్రాల మధ్య వస్తు రవాణా కూడా ఇకపై చౌకగా మారనుందని అన్నారు. నిత్యావసర వస్తువులపై కేవలం 5 శాతం మాత్రమే పన్ను ఉంటుందని.. జీఎస్టీ కొత్త సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ మరింత పరుగులు పెడుతుందన్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు ఉపయోగించే అనేక వస్తువులపై సున్నా శాతం జీఎస్టీ ఉండగా.. కొన్ని  వస్తువులపై మాత్రమే 5 శాతం జీఎస్టీ ఉంటుందన్నారు. మధ్య తరగతి ప్రజలపై భారం తగ్గించేందుకే రూ.12 లక్షల వరకు ఐటీ మినహాయింపు ఇచ్చామని.. నాగరిక్ దేవోభవ.. అనే నినాదంతో తాము ముందుకెళ్తున్నామని అన్నారు. జీఎస్టీ తగ్గించడంతో కుటీర పరిశ్రమలకు ఎంతో మేలు జరుగుతుందని.. అలాగే హోటల్స్ సేవలపై కూడా జీఎస్టీ తగ్గించామని అన్నారు. దేశప్రజలంతా స్వదేశీ మంత్రం పాటించి.. విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఎస్ఎంఈలకు అత్యధిక ప్రయోజనం చేకూరేలా మార్పులు చేశామని, ప్రతి పౌరుడు స్వదేశి ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు.