4 June, 2026 | 2:42 AM

ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ప్రాధాన్యం

04-06-2026 02:06 AM

మహబూబాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజ్ తదితర విద్యా సంస్థలలో అడ్మిషన్ల శాతం పెంచాలని, జిల్లాలోని భవిత కేంద్రాల బలో పేతానికి కృషి చేయాలని, కొత్త ప్రీ ప్రైమరీ విభాగాలను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు.

విద్యార్థుల సంఖ్యలేని ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని, పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు పంపిణీ చేయాలని, స్వయం సహాయక బృందాల చేత పిల్లలకు యూనిఫామ్ కుట్టించాలని, నూతన టెక్నాలజీ ఏఐ, డిజిటల్ తరగతులను నిర్వహించాలని, విద్యాశాఖ బలోపేతానికి ప్రత్యేక కార్యచరణ ప్రకారం ముందుకు సాగాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణ, అన్ని జిల్లాల కలెక్టర్ల, డిఈఓతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇతర ఉన్నత విద్యాశాఖ అధికారులు అందరికీ సమీక్ష నిర్వహిస్తూ విద్యార్థుల తక్కువ నమోదు పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థుల నమోదు పెంచుటకై,  ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలని, కనీస సా మర్ధ్యాలు చదవడం, రాయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పాఠశాలల్లో ఏర్పాటు చేసే మౌలిక వసతుల గురించి తల్లిదండ్రులకు వివరించాలని, వీటి ఆధారంగానే పాఠశాలలకు ప్రగతి సూచికలు ఇవ్వబడతాయని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రీ ప్రైమరీ పాఠశాలలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, డిఆర్డిఓ పీడీ మధుసూదన రాజు, డీఈవో సత్య నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.