ప్రతి ఇంటిపై జాతీయ జండా ఎగరవేయాలి
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి
కామారెడ్డి, ఆగస్టు 10 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సోమవారం కామారెడ్డిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జాతీయ జండాను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర పోరాట యోధులను స్మరించుకుంటూ వారి త్యాగాలపై సాధించిన స్వాతంత్య్రాన్ని నేటి తరం వారికి గుర్తు చేస్తూ రెపరెపలాడే జాతీయ జెండాను ప్రతి ఇంటిపై ఎగరవేయాలని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జాతీయ జండా ఎగురవేసినట్లు తెలిపారు.ప్రతి ఒక్కరు తమ తమ ఇంటిపై జాతీయ జండా ఎగురవేసి దేశభక్తి నీ చాటుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నరేందర్ రెడ్డి, అంజల్ రెడ్డి, మహిళా బిజెపి ప్రతినిధులు పాల్గొన్నారు.






