నీటి ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి
ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా
ఘట్ కేసర్, మార్చి 30 (విజయక్రాంతి): వర్షా కాలంలో నీటి ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా అధికారులను ఆదేశించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ చెరువును జోనల్ కమిషనర్ రాధిక గుప్తా సోమవారం సందర్శించి రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లను సమీక్షించారు. చెరువు పరిసర ప్రాంతాల్లో నీటి పారుదల వ్యవస్థలు, చెరువు బండ బలపరచడం, చెత్త తొలగింపు, డీసిల్టింగ్ పనుల పురోగతిని పరిశీలించారు.
ఈసందర్భంగా సంబంధిత అధికారులకు జోనల్ కమిషనర్ రాధిక గుప్తా పలు సూచనలు చేశారు. వర్షాల సమయంలో నీటిముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, చెరువులో నీటి ప్రవాహం సజావుగా ఉండేలా కాలువలను శుభ్రపరచాలని, చెరువు పరిరక్షణకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మాన్సూన్ ఏర్పాట్లను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈకార్యక్రమంలో ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎ. వాణి, ఈఈ రమేష్ బాబు, డిప్యూటీ ఈఈ నరేష్ కుమార్, డీఈఈ ఎస్. శ్రీనివాస్, ఏఈ రవి కిరణ్, ఏఈ విశేష్ నాయక్ (మెయింటెనెన్స్), తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.




