కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను పరిష్కరించాలి
కలెక్టరేట్ ఎదుట సీపీఎం నిరసన
మహబూబాబాద్, మే 11 (విజయక్రాంతి): మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు, ట్రాన్స్పోర్టు సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీపీఎం అనుబంధ తెలంగాణ రైతు సంఘం నేతలు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకన్న, సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల రాజు మాట్లాడుతూ జిల్లాల్లో అన్ని మండలాల్లో ఉన్న మార్క్ ఫెడ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరిగిందని, రైతుల సమస్యలను తెలుసుకున్నామన్నారు.
మార్క్ ఫెడ్, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సుమారు లక్ష బస్తాలు కాంటాలైనప్పటికీ ట్రాన్స్పోర్ట్ జాప్యం వల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాలు జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని, వివిధ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుంట ఉపేందర్, జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి, గూడూరు సిపిఎం ఏరియా కార్యదర్శి నక్క సైదులు, రైతు సంఘం జిల్లా నాయకులు నల్లపు సుధాకర్, దాసరి మల్లేశం, మాచర్ల సైదులు, కిషన్, వెంకట రాములు రైతులు పాల్గొన్నారు.






