సమస్యలను పరిష్కరించాలి
- వీవోఏ, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మిషన్ భగీరథ కార్మికుల డిమాండ్
- మంత్రి సీతక్కకు నాయకుడు మొగుళ్ల రాజిరెడ్డి వినతి
ముషీరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న వివోఏ, ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్లు, మిషన్ భగీరథ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు, ఐకేపి వివోఏ, ఫీల్ అసిస్టెంట్లు, మిషన్ భగీరథ కార్మికుల సంఘం అధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డి నేతృత్వంలో ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆర్.డి. చంద్రశేఖర్, వై. నాగన్న గౌడ్, యూనియన్ నేతలు రాష్ట్ర సచివాలయంలో మంగళవారం తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను కలసి వినతి పత్రం అందజేశారు.
ఐకేపి వివోఏ, ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్లకు, మిషన్ భగీరథ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, సమాన పనికి సమన వేతనం నెలకు 26 వేలు, ఉద్యోగ భద్రత, భీమాతో పాటు ఎఫ్.టి.ఈ వంటివి అందజేయాలని ఈ సందర్బంగా మొగుళ్ళ రాజిరెడ్డి మంత్రి మంత్రి సీతక్క ను కోరారు. వివోఏ, ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్లు, మిషన్ భగీరథ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబానికి 15 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని మొగుళ్ళ రాజిరెడ్డి విన్నవించారు.
మంత్రి సీతక్క సానుకూలంగా స్పందిస్తూ వివోఏ, ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్లు, మిషన్ భగీరథ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన జల మండలి గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన మొగుళ్ళ రాజిరెడ్డిని మంత్రి సీతక్క శాలువా, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ దివ్య దేవరాజన్, యూనియన్ నేతలు తలరి రాములు, బొల్గురి రవి, కంకాల సిద్దిరాజు, చల్లా వెంకటేశ్వర్లు, గోల్కొండ సురేష్, శంకర్ బబ్బురి, ఉపేందర్, వేల్పుల మల్లన్న, శ్రీను, ఇండ్ల రమేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.






