7 August, 2026 | 3:05 AM

తెలంగాణ సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్

07-08-2026 02:16 AM

భద్రాద్రి కొత్తగూడెం, జులై 6, (విజయక్రాంతి): తెలంగాణ సాధనలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన జయంతి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం  ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం అంకితభావంతో చేసిన కృషి రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆయన చూపిన మార్గం, ఆయన ఆలోచనలు భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. సమాజ అభ్యున్నతి, ప్రజా సంక్షేమం కోసం ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, ప్రజాసేవలో ఉన్న అధికారులు, ఉద్యోగులు మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు,  ఉద్యోగులు తదితరులు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్కు ఘనంగా నివాళులర్పించారు.