8 July, 2026 | 2:02 AM

ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

08-07-2026 12:00 AM
  1. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్
  2. అధ్యాపక ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుంది
  3. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
  4. అధ్యాపకుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది
  5. టీఎల్‌ఎఫ్ చైర్మన్ డాక్టర్ కత్తి వెంకటస్వామి

ముషీరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): అధ్యాపక, ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ లెక్చరర్స్ ఫోరం చైర్మన్ డాక్టర్ కత్తి వెంకటస్వామి ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం 19వ ఆవిర్భావ వేడుకను, ద్విదశాబ్ది ఉత్సవ ప్రారంభ సభను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్,  మాజీ ఎమ్మెల్సీ కపిల వాయి దిలీప్ కుమార్, బి స్మార్ట్ అధ్యక్షుడు శ్రీపతి శేఖర్ రెడ్డి, డాట్స్ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ చంద్ర తదితరులు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ అధ్యాపక ఉద్యోగులు గత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఫలితంగానే బీఆర్‌ఎస్ ఓడిపోయిందని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు అధ్యాపకుల, ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు తమ మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. 

మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్  మాట్లాడుతూ అధ్యాపక ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. టీఎల్‌ఎఫ్ చైర్మన్ డాక్టర్ కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అధ్యాపక ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం,  అధ్యాపకుల హక్కుల కోసం, ఉద్యమ శక్తుల పునరేకికరణ కోసం టీఎల్‌ఎఫ్ నిరంతరం పనిచేస్తుందన్నారు. 

ఈ సందర్భంగా ద్వి దశాబ్ది ఉత్సవాల కమిటీని ప్రకటించారు. కమిటీ చైర్మన్ గా మాజీ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ సి. భాస్కరరావును చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగిందని ప్రకటించారు. ఈ సమావేశంలో టీఎల్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి. వేణు,  కోశాధికారి రిటైర్డ్ ప్రిన్సిపల్ మనోహర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.