జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి
- టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, తన్నీరు శ్రీనివాసులు
- 10న రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ అధికారులకు వినతులు
సికింద్రాబాద్, జూలై 7 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని కోరుతూ ఈనెల 10వ తేదీన జర్నలిస్టుల వినతులు అనే కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, తన్నీరు శ్రీనివాస్ లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఆర్టీసీ బస్ చార్జీల్లో 1/3 వంతు రాయితీ కల్పించినప్పటికి ఆర్టీసీ సంస్థ మాత్రం దాదాపు 50 శాతం చార్జీలు వసూలు చేస్తున్నారని, దీనివల్ల నిత్యం వార్తా సేకరణకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే జర్నలిస్టులకు భారమవుతుందని అన్నారు. ప్రభుత్వం చాలా ఏళ్ళుగా జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో 1/3 రాయితీ పై ప్రయాణ సదుపాయం అమలు చేస్తుందని, అయితే ఇటీవల కాలంలో టోల్ ఫీజు, సర్వీస్ చార్జి పేరుతో మూడోవంతు చార్జీలను 50 శాతానికి పెంచారని తెలిపారు.
పేరుకే 1/3 చార్జీలని, కానీ 50% చార్జీలు వసూలు చేస్తున్నారని అన్నారు.రాష్ట్రంలో అనేక మంది జర్నలిస్టు లు సరైన వేతనాలు లేకపోయినప్పటికి జర్నలిజం వృత్తిలో కొనసాగుతూ ప్రభుత్వా నికి, ప్రజలకు,ఆర్టీసీ సంస్థకు సేవలంది స్తున్నారని,అటువంటి జర్నలిస్టులు వార్తల సేకరణ కోసం ఆర్టీసీ బస్సుల్లోప్రయాణించాల్సి వస్తుందని, ఫలితంగా ఆర్టీసీ ప్రయాణ చార్జీల భారం విపరీతంగా పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ.కొద్ది సంఖ్యలో ఉన్న జర్నలిస్టులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించకపోవడం బాధాకరమని అన్నారు. జర్నలిస్టులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడం వల్ల ప్రభుత్వానికి, ఆర్టీసీ సంస్థకు పెద్ద ఆర్ధిక భారమేమీ పడదని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు అన్ని అర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని వారు కోరారు.ఈ నెల 10వ తేదీన రాష్ట్ర రవాణా శాఖ మంత్రితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ అధికారులకు అనగా ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రీజినల్ మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు డిపో మేనేజర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.






