ఇడుపు కాయితం.. శ్రీలత వస్తోంది!
ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. ఈ సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి(Director Vamshi Reddy Dondapati) తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఎంటర్‌టైనింగ్ డ్రామాగా రూపొందిస్తున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), జోర్దార్ సుజాత, చంద్రవ్వ, మౌనికరెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హీరో ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా మ్యూజికల్ ప్రోమోషన్స్‌కు తెర తీస్తూ ఈ సినిమా నుంచి ‘శ్రీలత సాంగ్..’ ప్రోమోను రిలీజ్ చేశారు. కొత్తగా పెళ్లయిన జంట శ్రీలత, శ్రీనివాస్ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్‌గా ఈ పాటను చిత్రీకరించారు. ‘ఓ శ్రీలత శ్రీలత శ్రీలత నువ్వు సిన్నబోకే నా శ్రీలత.. శ్రీలత శ్రీలత శ్రీలత ఈ శ్రీనివాసుడే నీ జత..’ అంటూ సాగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి స్వరపర్చిన ఈ పాట ఫుల్ వెర్షన్‌ను త్వరలో రిలీజ్ చేయనున్నారు.






