ప్రోత్సాహం పెండింగ్!
చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు భారీగా బకాయిలు
మే 20 నాటికి పేరుకుపోయిన 3736.6 కోట్లు
గతంలో కంపెనీలకు చేరని ప్రోత్సాహకాలు
కొత్త పాలసీని సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో గత ప్రభుత్వం చేపట్టిన పథకాల్లోని లొసుగులు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. నూతన పారిశ్రామిక పాలసీ (ఇండస్ట్రియల్ పాలసీ) పేరుతో అట్టహాసంగా ప్రారంభించినప్పటికీ.. దాని ని సక్రమంగా అమలు చేయడంలో మాత్రం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని తాజా ఫలితాలు సూచిస్తు న్నాయి. పరిశ్రమలకు వివిధ ప్రోత్సాహకాల (ఇన్సెంటివ్స్) కింద ఇవ్వా ల్సిన బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు ఉదాహరణగా కనిపిస్తున్నది.
ఇన్సెంటివ్ బకాయిల గణాంకాలను పరిశ్రమల శాఖ తాజాగా అనధికారికంగా లీక్ చేసింది. ఇలాంటి లోటు పాట్లు రాకుండా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వివిధ ప్రోత్సహకాలుగా చెల్లించాల్సిన మొత్తం రూ.3,736.67 కోట్లు బకా యి ఉన్నదని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలను పెండింగులో పెట్టడంతో పలు ఎంఎస్‌ఎం ఈలు మూసివేసే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. గత ప్రభుత్వం బడ్జెట్లో ఎంఎస్‌ఎంఈలకు రాయితీలు, సబ్సిడీలు, ఇన్సెంటివ్‌లకు నిధులు కేటాయించింది. కానీ వాటిని పరిశ్రమలకు విడుదల చేయలేదు.
చెక్కులకు కూడా ల్యాప్స్
ఈ నెల 20 నాటికి చిన్న, మధ్యతరహా పరిశ్రలకు ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ. 3,736.67 కోట్లు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో రూ.3,007 కోట్లు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించినవి కాగా.. రూ.728 కోట్లు భారీ, మెగా పరిశ్రమలకు సంబంధించినవి ఉన్నాయి. దీంతోపాటు 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొన్ని పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం ఇచ్చిన రూ.684 కోట్ల విలువైన చెక్కులు కూడా ల్యాప్స్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో పాత పారిశ్రామిక విధానాన్ని రద్దుచేసి కొత్త పాలసీని తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రోత్సాహకాలను పెండింగులో పెట్టకుండా.. ఎప్పటికప్పుడు అందించాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసేలోగా నూతన పాలసీని సిద్ధంచేసి కోడ్ ఎత్తివేయగానే అమల్లోకి తీసుకొచ్చేందుకు పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మే 20 నాటికి పెండింగులో ఉన్న ప్రోత్సాహక బకాయిలు (రూ.కోట్లలో)
అంశం పెండింగ్ 2023 మొత్తం
లాప్స్ అయిన చెక్కులు
జనరల్ 1,706.43 330.68 2,037.11
ఎస్‌సీపీ 389.98 272.5 662.48
టీఎస్‌పీ 956.22 80.86 1,037.08
మొత్తం 3,052.63 684.04 3,736.67
ప్రైవేటు పాలిషింగ్!
కొత్త పారిశ్రామిక విధానాలపై ప్రైవేటు స్టడీ
రంగంలోకి దిగనున్న పలు ఏజెన్సీలు
హైదరాబాద్, మే 24 ( విజయక్రాంతి): ఆరు నూతన పారి శ్రామిక పాలసీలను రూపొందించే పనిలో సంబంధిత శాఖ అధికారులు నిమగ్నమయ్యా రు. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కొత్త విధానాల రూపకల్పన జరుగుతోంది. అయితే కొత్త పాలసీ లను తయారు చేసే క్రమంలో ప్రపంచంలోని అత్యుత్తమ పారిశ్రామిక విధానాలను అధ్య యనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిం చారు. ఈ క్రమంలో ప్రపంచంలోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసే బాధ్యతను పరిశ్రమల శాఖ కొన్ని గుర్తింపు పొంది న ఏజెన్సీలకు అప్పగించినట్లు సచి వాలయ వర్గాలు తెలిపాయి.
ప్రైవేటు ఏజెన్సీలో అత్యుత్తమ పారిశ్రామిక విధానాలను స్టడీ చేసి.. తెలంగాణకు సరిపోయే విధానాలను వడపోసి.. సంబంధిత శాఖకు నివేదికను అందజేయనున్నట్లు సమాచారం. జూన్ 1వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. అనంతరం.. పరిశ్రమల శాఖ పాలసీల రూపకల్పన చేసి.. సర్కారుకు తుది నివేదికను జూన్ 8వ తేదీ లోపు సమర్పించే అవకాశం ఉంది.
ఈ నెల 21వ తేదీన పారిశ్రామిక రంగంపై నిర్వహించిన సమీక్షలో.. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఆరు నూతన పాలసీలను రూపొందిస్తున్నట్లు సీఎంకు అధికారులు వివరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ ముగిసే నాటికి నూతన విధానాల రూపకల్పన పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. సమయం తక్కువగా ఉండటంతో.. ప్రపంచంలోని ఉత్తమ పాలసీలను అధ్యయనం చేసే బాధ్యతను గుర్తింపు పొందిన ప్రైవేటు ఏజెన్సీలకు పరిశ్రమల శాఖ అప్పగించినట్లు తెలుస్తోంది.
అంతర్గత మీటింగ్‌లతో బిజీబీజీ..
సీఎం రేవంత్ రెడ్డితో సమీక్షా సమావేశం ముగిసిన మరుసటి రోజు నుంచి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు నూతన పాలసీలపై కుస్తీలు పడుతున్నారు. పాలసీలను ఎలా రూపొందించాలి? ఎలాంటి విధానాలను పొందుపర్చాలి? పెట్టబడులను ఆకర్షించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అంతర్గత మీటింగ్‌లతో బిజీబిజీగా గడుపుతున్నారు. పాలసీల రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖకు చెందిన ఉన్నతాధికురులు అంతర్గత సమావేశాన్ని ఇప్పటికే ఒకసారి నిర్వహించారు. అనంతరం విభాగాల వారీగా ప్రతిరోజు మీటింగ్‌లు పెడుతూ.. విధానాల తయారీపై ఫోకస్ పెడుతున్నారు.
ప్రోత్సాహకాలు.. సులభంగా అనుమతులు..
పరిశ్రమల శాఖ ఆరు పాలసీలను ఆరు రంగాల్లో తయారు చేస్తోంది. అందులో ఎంఎస్‌ఎంఈ, ఎక్స్‌పోర్టు, న్యూ లైఫ్‌సైన్సెస్, రివైజ్డ్ ఈవీ, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ రంగాలు ఉన్నాయి. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతోనే నూతన విధానాల రూపకల్పన జరుగుతోంది. పెట్టుబడులను రాబట్టేందుకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపై పరిశ్రమల శాఖ దృష్టి సారించింది. పాలసీల తయారీలో ఆరు రంగాలకు ప్రాధాన్యం ఇస్తూనే.. వ్యూహాత్మకంగా ఎంఎస్‌ఎంఈ, చేతివృత్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ సూచనల మేరకు ఎంఎస్‌ఎంఈ, చేతివృత్తులకు ప్రత్యేక రాయితీలు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాధి కల్పనలో ఈ రెండు రంగాలు కీలక పాత్రను పోషిస్తాయి. అందుకే నూతన పాలసీల్లో వీటికి వీలైనన్ని ఎక్కువ ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఈజీ ఆఫ్ డూయింగ్‌లో భాగంగా అనుమతులను మరింత సులభతరం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల నూతనంగా పెట్టుబుడులు పెట్టాలనుకునే కంపెనీలకు తెలంగాణ గమ్యస్థానంగా ఉంటుందని పరిశ్రమశాఖ భావిస్తోంది.
అమెరికా నుంచే మానిటరింగ్!
రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 6,7,8 తేదీల్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా యూఎస్ వెళ్లే అవకాశం ఉంది. అయితే శ్రీధర్ బాబు పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కొత్త పాలసీల రూపకల్పనను జయేష్ రంజన్ అమెరికా నుంచి మానిటరింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. జయేష్ రంజన్, మంత్రి శ్రీధర్ బాబు కలిసి వచ్చే నెల అమెరికాలో పలు కంపెనీలతో సమావేశం కానున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నారు. శ్రీధర్ బాబు అమెరికాకు వెళ్లేవరకు జయేష్ రంజన్ అక్కడే ఉండే అవకాశం ఉంది.






