24-02-2026 12:00:00 AM
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతాయన్నారు.
జిల్లా వ్యాప్తంగా 7,228 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 37 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 37 మంది సూపర్డెంట్లు, 37 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు పరీక్షల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు సజావుగా పూర్తయ్యేలా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
నిర్ణీత సమయానికి విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. లోటుపాట్లకు తావులేకుండా పరీక్షలు సజావుగా కొనసాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, డిఇఓ అబ్దుల్ ఘని, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.