8 April, 2026 | 5:44 AM

గంజాయి విక్రేతల ఆస్తులు సీజ్

08-12-2024 12:28 AM
  1. మత్తు పదార్థాల కట్టడికి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు 
  2. ఈజీ మనీతో సంపాదించిన ఆస్తుల జప్తు చేసే యోచన
  3. నగరంలోని ధూల్‌పేట్ నుంచి అమలుకు శ్రీకారం

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2 (విజయక్రాంతి): హైదరాబాద్‌ను గంజాయి రహిత నగరంగా మార్చే లక్ష్యంతో కఠిన చర్యలు తీసుకునేందుకు ఎక్సైజ్ అధికారులు సిద్ధమవుతున్నారు. గంజాయి, మత్తు పదార్థాల విక్రేతలపై ఇదివరకు కేసులు పెట్టి జైలు కు పంపించినా పలువురు బుద్ధి మార్చుకోకుండా పదేపదే గంజాయి కేసుల్లో పట్టు బడుతున్నారు.

ఈ నేపథ్యంలో వీరిపై ఉక్కుపాదం మోపాలని భావిస్తున్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అమ్మకం ద్వారా కూడబెట్టిన ఆస్తులను గుర్తించి వాటిని జప్తు చేసేలా ప్రణాళికలు వేస్తున్నారు. నగరంలో ఎక్కడ గంజాయి లభించినా మూలాలు ధూల్‌పేట్‌తో ముడిపడి ఉంటున్నాయి.

అందుకోసమే ఈ ఏడాది జూలైలో ‘ఆపరేషన్ ధూల్‌పేట్’ పేరిట స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దీంతో అమీర్‌పేట్, కుత్బుల్లాపూర్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో కొంత మంది ధూల్‌పేట్‌కు చెందిన వ్యక్తులు గంజాయి కేసుల్లో దొరుకుతుండటంతో వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఇటీవల ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. 

ఎన్‌డీపీఎస్ 68ఎఫ్, పీడీ యాక్ట్ ప్రయోగం.. 

మత్తు పదార్థాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు, టీజీన్యాబ్, పోలీసులు, ఎక్సైజ్ శాఖ నిర్వహిస్తు న్న దాడులతో గంజాయి అమ్మకాలు కొంతమేర తగ్గాయి. అయినా అక్కడక్కడ గంజా యి పట్టుబడుతున్న ఘటనలు ఆయా శాఖలను కలవరపెడుతున్నాయి. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చేపట్టిన ‘ఆపరేషన్ ధూల్‌పేట్’లక్ష్యాన్ని చేరుకున్నామని అధికారులు చెబుతున్నా..

ధూల్‌పేట్‌కు చెందిన పలువురు నగర శివార్లలో తలదాచుకొని అక్కడి నుంచి విక్రయాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఎక్సైజ్ అధికారులు గుడుంబా నియంత్రణలో అవలంబించిన పద్ధతులను ఆపరేషన్ ధూల్‌పేట్, గంజాయి ఫ్రీ సిటీగా మార్చడం కోసం అవలంబించబోతున్నారు.

ఇక నుంచి ధూల్‌పేట్‌లోని గంజాయి విక్రేతల ఆస్తులను జప్తు చేపట్టేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు ఎక్సైజ్ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఎన్‌డీపీఎస్ చట్టంలోని 68ఎఫ్ ప్రకారం ఈ చర్యలు  తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ధూల్‌పేట్ ఎక్సైజ్ సూపరింటిండెంట్‌గా పనిచేస్తున్న నంద్యాల అంజిరెడ్డి కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ కేసులో అరెస్టయిన భరత్ తుక్రాల్ అనే నిందితుడిపై 2020లో రాష్ట్రంలోనే తొలిసారిగా 68ఎఫ్‌ను ప్రయోగించారు.

ధూల్‌పేట్‌లో గంజాయి నియంత్రణకు అదే పద్ధతిని అవలంచించి దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే గంజాయి విక్రేతలపై పీడీయాక్ట్‌ను కూడా ప్రయోగించబోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. టీజీన్యాబ్ ఆధ్వర్యంలో ఇటీవల మూడు కేసుల్లో దాదాపు రూ.7.5 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు.

మత్తు పదార్థాల అమ్మకం ద్వారా నిందితులు కూడగట్టిన రూ.55 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన పట్ల కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఎక్సైజ్ అధికారులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఆపరేషన్ ధూల్‌పేట్‌లో భాగంగా ఇప్పటివరకు 330 కిలోల గంజాయి, 4.2 కిలోల హాషీష్ ఆయిల్, 38 బైక్‌లు, రెండు కార్లను పట్టుకున్నారు. 218 మందిపై 61 కేసులు నమోదు చేశారు. వీరిలో 40 మందిని అరెస్ట్ చేయగా, మరో 67మంది పరారీలో ఉన్నారు. 141 మందిని బైండోవర్ చేయగా 15 మందికి జరిమానా విధించారు. 128 కేసుల్లో చార్జిషీట్ వేశారు.

గంజాయి, డ్రగ్స్ విక్రయాలను ఉపేక్షించం

గంజాయి, డ్రగ్స్ విక్రయాలను ఉపేక్షించం. నాడు నాటు సారా అమ్మకాలను నిలిపివేసినట్లే గంజాయి విక్రయాలను కూడా ధూల్‌పేట్ వాసులు ఆపివేయాలి. గంజాయి, డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. మత్తుపదార్థాల విక్రయం పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. 

-- వీబీ కమలాసన్‌రెడ్డి, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్