10 May, 2026 | 2:38 AM

కవిజనాశ్రయుడు రేచన

13-05-2024 12:05 AM

ఛందస్సు పద్య కవిత్వానికి ప్రాణ సమానమైన అంశం. దీన్ని లక్షణ శాస్త్రకారులు గుర్తించి తమతమ భాషల్లోని కవులకు ఉపయుక్తమయ్యే విధంగా వివిధ ఛందోగ్రంథాలను అందించారు. సంస్కృత, కన్నడ భాషల్లో ఎన్నో ఛందోగ్రంథాలు వెలుగుచూశాయి. తెలుగుభాషలో ఆ లోటు లేకుండా చెయ్యాలన్న సంకల్పంతో వేములవాడ ప్రాంతానికి చెందిన ‘మల్లియరేచన’ ఒక ఛందోగ్రంథాన్ని తెలుగులో రచించి దానికి ‘కవిజనాశ్రయము’ అని పేరు పెట్టాడు. తెలుగుభాషకు ఇది తొలి ఛందోగ్రంథంగా విమర్శకులు, సాహితీవేత్తలు పేర్కొంటారు.

వేములవాడ, కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాలను ‘సచ్చినాడు’ ‘సబ్బి మండలం’ అంటూ శాసనాలు పేర్కొన్నాయి. ఈ ప్రాంతంలో సంస్కృత, ప్రాకృత, కన్నడ భాషాకవులు అనేకులు వుండేవారు. యశస్తిలక చంపువు, నీతి వాక్యామృతం వంటి అనేక గ్రంథాలు ఈ ప్రాంతం నుండే వెలువడ్డాయి. క్రీ.శ. 940 ప్రాంతంలో మల్లియరేచన వేములవాడలో జన్మించి ఉంటాడని చరిత్రకారుల భావన. ఆ కాలంలో ఈ ప్రాంతమంతా పశ్చిమ చాళుక్యుల ఏలుబడిలో ఉండేది. కన్నడ భాషా ప్రాముఖ్యం ఈ ప్రాంతంలో ఎక్కువ. ఇక్కడి వాడైన ‘పంప మహాకవి’ కన్నడ భాషలో ‘విక్రమార్జున విజయము’ పేర మహాభారతాన్ని రచించాడు. కన్నడ రత్నత్రయంలో ఒకడైన పంప మహాకవి సోదరుడు జినవల్లభుడు మల్లియరేచనకు ప్రాణ సమానుడైన మిత్రుడు. ఆ విషయాన్ని రేచనయే తన ‘కవిజనాశ్రయ’ అవతారికలో 

“అసమాన దాన రవి తను

య సమోన్నతుడు, వాచకాభరణుడు, ప్రా

ణ సమాన మిత్రుడీ కృతి

కి సహాయముగా నుదాత్త కీర్తి ప్రీతిన్‌” 

అనడమే నిదర్శనం. ఆయన తోడ్పాటుతో అనేక కావ్యాలను, లక్షణ గ్రంథాలను రేచన అధ్యయనం చేసి ఉంటాడు. తెలుగులోని తొలికంద పద్యాలున్న కుర్క్యాల శాసనం జినవల్లభుడు వేయించిందే. ఇందులోని మూడు కందపద్యాలే తెలుగులోని తొలి కంద పద్యాలని సాహిత్య చరిత్రకారులు పేర్కొన్నారు.

శ్రావకాభరణుడు

మిత్రులైన రేచన, జినవల్లభులు ఇరువురికి సంబంధించిన పలు అంశాల్లో పోలికలు వున్నాయి. రేచన ‘శ్రావకాభరణుడు’ అన్న బిరుదున్నవాడు, జినవల్లభుడు ‘వాచకాభరణుడు’. ఇద్దరూ జైన మతావలంబులే. ఇద్దరి తండ్రుల పేర్లు ‘భీమన’యే. అయితే, జినవల్లభుడు రెండో కుమారుడు, రేచన మాత్రం పెద్ద కుమారుడు. 

రేచనయే తన ‘కవిజనాశ్రయము’లో

“పరగ యశో భా

సుర నిరతుడు భీమనాగ్ర సుతుడు..” 

అని చెప్పుకొన్నాడు. 

గ్రంథం మొదట్లోనే ‘జననుత భీమ తనూజా!’ అనడం కూడా రేచన తండ్రి పేరు భీమనగా భావించవచ్చు. 

మల్లియరేచన పలు విషయాల్లో తొట్టతొలి వ్యక్తిగా గుర్తింపబడ్డాడు. ఈయనకు ‘కవిజనాశ్రయుడ’నే పేరున్నట్టుగా ఇందులో కనిపించే 

‘కవిజనాశ్రయుడు మల్లియరేచన సుకవి కవిజనాశ్రయమను ఛందము తెనుగు బాస నరుదుగ జెప్పన్’ 

అన్న వాక్యాన్నిబట్టి చెప్పవచ్చు. కావ్యంలో పేర్కొన్న 

‘శ్రీవాదీంద్ర చూడామణి చరణ సరసీరుహ మధుకరాయ మాణ కవిజనాశ్రయ శ్రావకాభరణాంక విరచితంబైన కవిజనాశ్రయంబను ఛందంబు..’ 

అనే గద్యాన్నిబట్టి ఈయన జైనమునియైన వాదీంద్ర చూడామణి శిష్యుడని తెలుస్తున్నది. ‘జనాశ్రయుడు’ అన్న పదం అప్పటికే ఈ ప్రాంతంలో వాడుకలో ఉంది. ఆరవ శతాబ్దానికి చెందిన విష్ణుకుండిన రాజైన మాధవవర్మ (జనాశ్రయుడు) ‘జనాశ్రయం ఛందోవిచ్ఛిత్తి’ అనే ఛందోగ్రంథాన్ని సంస్కృత భాషలో రచించాడు. రేచన ఈ గ్రంథాన్ని చూసి ఉండడం వల్ల తన ఛందోగ్రంథానికి కూడా ‘కవిజనాశ్రయము’గా పేరు పెట్టి ఉండవచ్చు. మల్లియరేచన తన మిత్రుడైన జినవల్లభుని ప్రత్యేకంగా ప్రస్తావించిన కారణంగా ఆయన కాలం గురించి వేరే ప్రమాణాలు అవసరం లేకుండా పోయింది. జినవల్లభుడు 10వ శతాబ్దం వాడు కనుక రేచన కాలం కూడా 10వ శతాబ్దమేనని చెప్పవచ్చు. కరీంనగర్ జిల్లా కుర్క్యాల (బొమ్మలగుట్ట) శాసనకాలం క్రీ.శ. 946 గనుక ఈయనను కూడా అదే కాలం వాడుగా భావించాలి. ఈ జినవల్లభుడు వేములవాడ రాజధానిగా పాలించిన చాళుక్యరాజు అరికేసరి (910 ఆస్థాన కవియైన పంపకవి తమ్ముడు కావడం కూడా దీనికి ఒక ప్రమాణంగా నిలుస్తుంది.

తొలి తెలుగు ఛందోగ్రంథకర్త

‘వాచకాభరణుడు’గా కీర్తి గాంచిన ఈ జినవల్లభుని పోత్సాహంతో రచింపబడిన రేచన తొలి ఛందోగ్రంథమైన ‘కవిజనాశ్రయాన్ని’ భీమన ఛందంగా అప్పకవి వంటి లాక్షణికులు పేర్కొన్నారు. ఈ కారణంగా, దీని కర్తృత్వాన్ని వేములవాడ భీమకవికి ఆపాదించిన వారు జయంతి రామయ్యపంతులు, కవిజనాశ్రయ ముద్రణ తొట్ట తొలిసారి చేపట్టిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారు ఈ రచన వేములవాడ భీమకవి రచనగా పేర్కొన్నారు. తరువాత వావిళ్ల వారు నిడుదవోలు వేంకటరావు విపులమైన పీఠికతో దీనిని పరిష్కరించి కావ్య ప్రారంభంలోనే ప్రత్యేకంగా పేర్కొన్న పద్యాల ప్రమాణాన్ని గుర్తించినందున దీనిని మల్లియరేచన రచనగానే ముద్రించారు. మల్లియరేచన తనకు పూర్వం సంస్కృతంలో, కన్నడంలో ఉన్న ఛందోగ్రంథాలను లోతుగా అధ్యయనం చేసి తన రచనను రూపొందించుకున్నారు. జయదేవుని ఛందస్సు మొదలైన వాటిని గురించి

“జయదేవాదిచ్ఛందో

నయమున సంక్షేప విధమునన్ జెలువుగ మ

ల్లియ రేచన సుకవి జనా

శ్రయుడీ ఛందంబు జెప్పె జనులకు దెలియన్‌”

అంటూ చెప్పిన పద్యం దీన్ని బలపరుస్తున్నది. బహుశా జనాశ్రయుని ఛందోవిచ్ఛిత్తి, జయదేవుని ఛందస్సు ఈయనకు మార్గదర్శకాలై ఉండవచ్చు. అంతేగాక, కన్నడకవి నాగవర్మ (క్రీ.శ. 990) ‘కన్నడ ఛందోంబుధి’కి ఈ రచనకు ఎన్నో పోలికలు కనిపిస్తున్నాయి. ‘కవిజనాశ్రయము’లో అనేకమార్లు కనిపించే రేచన పేరును ప్రక్కకు పెట్టి ఇది భీమకవి రచనగా చెప్పడాన్ని ‘ఆరుద్ర’గారి వంటి సాహిత్య చరిత్రకారులు కూడా విమర్శించారు. దానికి కారణాలను అన్వేషించారు. యతిప్రాసలు, గణఛందస్సు వంటి అనేకానేక ఛందోవిశేషాలను తెలిపే మల్లియరేచన రచన ‘కవిజనాశ్రయము’ తెలుగు ఛందోగ్రంథాలకు మార్గదర్శకమన్న అంశం అక్షర సత్యం.


 వ్యాసకర్త సెల్‌: 9949013448