వంట గ్యాస్ ధరల పెంపుపై నిరసన
శంకర్ పల్లి, మార్చి 15: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ శంకర్ పల్లి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లారం ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతర్జాతీయ పరిస్థితులను సాకుగా చూపుతూ గృహ అవసరాల గ్యాస్పు రూ. 60, కమర్షియల్ గ్యాస్పు రూ. 114 పెంచడం సామాన్యులపై అదనపు భారం మోపడమేనని నేతలు విమర్శించారు.
యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని ధ్వజమెత్తారు.ఇర్పా ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి దిగడం సరికాదని, దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత ఏర్పడి నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సంజయ్ పాల్గొన్నారు.




