రైతులకు సరిపడా యూరియా అందించాలని రాస్తారోకో
నకిరేకల్,(విజయక్రాంతి): రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచి పంట పొలాలను రక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నకిరేకల్ తిప్పర్తి రహదారిపైన రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల మాట్లాడుతూ... రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలన్నారు. యూరియా కోసం రైతులు డీలర్ల వద్ద, సహకార సంఘాల వద్ద రాత్రి, తెల్లవారుజాము నుండే క్యూలైన్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
రైతులకు నిలబడే ఓపిక లేక లైన్లో పాస్ పుస్తకాలు, చెప్పులు ఉంచాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. అరకొరగా యూరియా రావడం వలన రైతులకు అందరికీ అందక నిరాశ చెందుత్తు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క రైతుకు ఐదు నుండి పది బస్తాలు యూరియా అవసరాలు ఉంటే ఒకటి రెండు బస్తాల యూర ఇస్తే ఏ విధంగా సరిపోతుందో చెప్పాలని ఆమె తెలిపారు. అధికారులు మాత్రం ఖరీఫ్ సీజన్ కు సరిపడ యూరియా అందుబాటులో ఉంచుతున్నాము అని అంటున్నారు కానీ ఫెర్టిలైజర్స్ వ్యాపారులు రైతులకు నువ్వు పురుగు మందులు తీసుకుంటేనే యూరియా బస్తాలు ఇస్తామని లింకులు పెడుతున్నారని ఆమె పేర్కొన్నారు.ప్రభుత్వం, అధికారులు రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు






