calender_icon.png 12 December, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్ల విస్తరణకు నిధులివ్వండి..

12-12-2025 12:00:00 AM

కేంద్ర మంత్రిని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్

కామారెడ్డి,  డిసెంబర్ 11 (విజయ క్రాంతి): గత రెండు రోజులుగా కామారెడ్డి ఎమ్మెల్యే  కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని పలువురు కేంద్రమంత్రులను వరుసగా కలిసి విన్నవిస్తున్నారు.ఇప్పటికే రైల్వే మంత్రిని కలిసి ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రోడ్డు ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలని కోరిన ఎమ్మెల్యే.. తాజాగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని  కలిసి నిధుల కోసం విన్నవించారు. కామారెడ్డి పట్టణ రింగ్ రోడ్డు, నియోజకవర్గంలో రోడ్ల విస్తరణకు నిధులు కేటాయించాలని వినతిపత్రం ఇచ్చారు.

కామారెడ్డి ఔటర్ రింగు రోడ్డు విస్తరణ వివరాలను కేంద్ర మంత్రికి వివరించారు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని కామారెడ్డి జిల్లా కేంద్రానికి 54 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగు రోడ్డు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. నాడు ప్రతిపాదించిన పనుల కోసం సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ స్టేజీ నుండి మెడికల్ కళాశాల, మైనారిటీ ఉమెన్ కళాశాల మీదగా జాతీయ రహదారి వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ కోసం రూ.40 కోట్లు ఇవ్వాలని విన్నవించారు.

భిక్కనూరు నుంచి తిప్పాపూర్, తలమడ్ల గ్రామాల మీదుగా రాజంపేట వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం రూ.18 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డు విస్తరణ కోసం రూ.8 కోట్లు, పాల్వంచ మర్రి నుంచి మందాపూర్ మీదుగా భిక్కనూరు వరకు డబుల్ రోడ్డు విస్తరణ కోసం రూ.24 కోట్లు విడుదల చేయాలని కేంద్రమంత్రికి విన్నవించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.